పేదలందరి సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. జులై 1న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే మెగా గ్రౌండింగ్ మేళాకు అన్ని రకాలుగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్య, వ్యవసాయ శాఖలు మినహా మిగిలిన యంత్రాంగమంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. నవరత్నాలు లో భాగంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి సంబంధించి, జులై 1,3,4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళాకు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మండల ప్రత్యేకాధికారులు, పర్యవేక్షకులు, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా శనివారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి మానస పుత్రిక అయిన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమని, దీనిలో ప్రతీఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జులై 1వ తేదీనే జిల్లా అంతటా ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. దానికి తగ్గ ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఆరోజు లబ్దిదారులంతా శంకుస్థాపన చేసి, ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అనువుగా నిర్మాణ సామగ్రిని కూడా లేఅవుట్‌లలో సిద్దంగా ఉంచాలన్నారు. అంతకుముందుగానే అన్ని లేఅవుట్లలో నీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని ఆదేశించారు. దీనికోసం వివిధ స్థాయిల్లో సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి, యాప్‌పైని, ఇతర అంశాలపైనా ముందుగానే అవగాహన కల్పించాలని చెప్పారు. మెగా మేళాలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేస్తామని, వారి సహకారంతో సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అనివార్య కారణాలతో 1వ తేదీన నిర్మాణాన్ని ప్రారంభించలేకపోయిన వారిచేత 3 లేదా 4వ తేదీన ఇంటిపనులు మొదలు పెట్టించాలని సూచించారు. గృహనిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్‌రూమును ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అంతకుముందు మాట్లాడుతూ, లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా, ముందుగానే వారిని చైతన్య పరచాలని కోరారు. ప్రతీ లబ్దిదారున్ని కలిసి, వారి పరిస్థితిని తెలుసుకొని, దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలని అన్నారు. ప్రత్యేకాధికారులు, తమ మండలంలోని ప్రతీ లేఅవుట్‌పైనా సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలని, ఎక్కడ సమస్య ఉత్పన్నమయినా, దానిని పరిష్కరించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతీ వలంటీర్ చేతా హౌసింగ్‌కు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాలని చెప్పారు.
జాయింట్ కలెక్టర్(అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడుతూ, వీలైనంత వరకూ మొదటిరోజే అన్ని ఇళ్లనూ గ్రౌండింగ్ చేసేలా చూడాలన్నారు. సచివాలయాల సిబ్బంది అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పారు. లేఅవుట్ ఇన్‌ఛార్జులు, క్లస్టర్ ఇన్‌ఛార్జులను మండల ప్రత్యేకాధికారులు సమన్వయం చేసుకొని, కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. లేఅవుట్లలో మౌలిక వసతులను కల్పించిన తరువాత మాత్రమే, ఇళ్ల నిర్మాణం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అందువల్ల ముందుగానే నీరు, విద్యుత్ తదితర సౌకర్యాలను పూర్తి చేయాలని సూచించారు.
జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్ మాట్లాడుతూ, జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమం ప్రణాళికను వివరించారు. రాష్ట్రప్రభుత్వం గృహనిర్మాణ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, దీనిలో భాగంగా తొలిదశలో జిల్లాలో సుమారు 55వేల ఇళ్లను నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికే దాదాపు 9వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలినవి 1వ తేదీన పని ప్రారంభించాలని కోరారు. గృహనిర్మాణంలో భాగంగా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, రిజిష్ట్రేషన్, జాబ్ కార్డు(రూరల్) అనే నాలుగు ముఖ్యమైన ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ప్రతీ లబ్దిదారుడికీ రూ.లక్షా, 80వేల రూపాయలను సబ్సిడీగా, మూడు దశల్లో ఇస్తుందని చెప్పారు. పర్యవేక్షణ కోసం ప్రతీ లేఅవుట్‌కు ఒక గ్రామస్థాయి అధికారిని, లేఅవుట్లను క్లస్టర్లుగా విభజించి, ప్రతీ క్లష్టర్ ఒక మండల స్థాయి అధికారిని, మండలానికి ఒక ప్రత్యేకాధికారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
ఈ అవగాహనా కార్యక్రమంలో ఐటిడిఏ పీఓ ఆర్.కూర్మనాధ్, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, డిఆర్ఓ ఎం.గణపతిరావు, ఆర్‌డిఓ బిహెచ్ భవానీ శంకర్, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.