పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పునరావాస కాలనీలలో యుద్థప్రాతిపధికన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ జె.వెంకట మురళి (ఆర్ బి. అండ్ ఆర్) అధికారులను ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్ , యర్రం చిన్న పోలిరెడ్డి పధకాల అభివృద్థి పనులు, భూసేకరణ పై సంబంధిత అధికారులతో శనివారం స్థానిక ప్రకాశం భవనంలోని ఆయన ఛాంబరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టులో త్వరలోనే జలాలను నింపడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందని జే.సి.
తెలిపారు. ఈ నేపధ్యంలో ప్రాజెక్టు ముంపు గ్రామాలలోని నిర్వాసితులను తరలించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పునరావాస కాలనీలో త్రాగునీటి సౌకర్యం, విద్యుత్, రహదారులు, మురికి కాల్వల నిర్మాణం తక్షణమే చేపట్టాలన్నారు. కనీస సదుపాయాలు పునరావాస కాలనీలలో ఏర్పాటు చేస్తే నిర్వాసితులను తరలించడానికి వీలవుతుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలు, హస్పిటల్, గుడి, మసీదులు, చర్చీలు, షాపింగ్ కాంప్లెక్స్, గ్రంధాలయం, పోస్టాఫీస్, బస్ షెల్టర్ , షాంపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. పునరావాస కాలనీలకు అనుబంధంగా స్మశానభూమి కేటాయించాలని, భూమి లేని ప్రాంతాలలో భూసేకరణ చేయాలన్నారు.
నిర్దేశించిన గడువులోగా గుత్తేదారులు పనులు చేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పురోగతిలేని పనులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రాజెక్టులో జలాలు నిల్వ చేస్తే ముంపునకు గురయ్యే గ్రామాలలో భూసేకరణ అత్యంత వేగంగా చేపట్టాలని జె.సి. మురళి తెలిపారు. ప్రాజె క్టు కాల్వలకోసం భూసేకరణ చెయ్యాలన్నారు. దేవరాజుగట్టు - 1 పునరావాస కాలనీలో రూ.88 లక్షల నిధులు విద్యుద్దీకరణకు విడుదలయినప్పటికీ పనులు మొదలుకాకపోవడంపై ఆరాతీశారు.
11 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, 11.08 కి.మీ. మురికి కాల్వ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దేవరాజుగట్టు - 2 పునరావాస కాలనీ లో 11.8 కి.మీ. మేర రహదారి నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం గ్రావెల్ రోడ్డు నిర్మించడం, 77 కల్వర్టులకు గాను 35 పూర్తయ్యాయన్నారు. వేములకోటలో 11 కి.మీ. మేర సి.సి.రోడ్ల నిర్మాణం 60 శాతం పూర్తయిందన్నారు. గోగులదిన్నె లో ఆర్.డబ్ల్యు.ఎస్. మంచినీటి ట్యాంకు నిర్మించగా విద్యుద్దీకరణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. భూసేకరణ, అభివృద్థి పనులలో అధికారులు తప్పు చేసినట్లు తేలితే ఉపేక్షించేది లేదని జె.సి. హెచ్చరించారు. సమావేశానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆయన సూచించారు.
ఇడుపూరు - 1 పునరావాస కాలనీలో నిర్మిస్తున్న పాఠశాల భవనాలు మూడు చివరిదశలో ఉండగా, నాలుగు దేవాలయాలు పునాది దశ దాటి గోడలు నిర్మిస్తున్నారని, గ్రంధాలయాలు, పోస్టాఫీసు, స్మశాన భూమి ప్రహరీ గోడ నిర్మాణం కాకపోడంపై ఆయన వివరాలడిగి తెలుసుకున్నారు. ఇడుపూరు - 2 లో ఆసుపత్రి శ్లాబు దశలో నిలిచిపోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. విద్యుద్దీకరణకు ఏర్పాట్లు చెయ్యాలన్నారు. గోగులదిన్నెలో పాఠశాల భవనాలు పునాదిస్థాయిలో ఉండగా, రెండు చర్చీలు, రెండు దేవాలయాలు పునాది దశలో ఉన్నాయని స్థలం
అప్పగింతలపై ఆరాతీశారు. తోకపల్లిలో 2.6 కి.మీ. సి.సి.రోడ్డును నిర్మించగా అంతర్గత మురకి కాల్వలు, వైద్యశాల
భవన నిర్మాణాలు చివరిదశలో ఉన్నాయన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, చిల్డ్రన్‌పార్క్ వివిధ దశలలో ఉన్నాయన్నారు.
ఉందుట్లలో భవన నిర్మాణాలు 20 శాతం పూర్తి కాగా సచివాలయం, ఆర్ .బి.కె., అం గన్ వాడీ కేంద్రం, హెల్త్ క్లినిక్
టెండర్ దశలో ఉన్నాయని, మిగిలిన పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. కందుల ఓబుల రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్ క్రింద రెండవ దశలో ముంపు కాలనీలోని 889 కుటుంబాలవారికి పునరావాసం తక్షణమే కల్పించాలని జె.సి. చెప్పారు. ప్రాజెక్టు క్రింద 24 ముంపు కాలనీలు ఉండగా ఏడింటిని తరలించారని, మిగిలిన వారిని తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. తొలిదశలోని పునరావాస కాలనీలకు
స్మశాన భూమి యుద్థప్రాతిపథికన ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. యర్రం చిన్నపోలిరెడ్డి
ఎత్తిపోతల పధకం క్రింద భూసేకరణ వేగంగా చేపట్టాలని, పాలేరు రిజర్వాయర్ క్రింద 103 ఎకరాల భూ సేకరణపై
ఆయన ఆరా తీశారు. ప్రాజెక్ట్‌ల అభివృద్థి పనులు వేగంగా చేపట్టాలని అధికారులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. సమావేశంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్.సరళా వందనం, ఆర్.డబ్ల్యు.ఎస్. ఎస్.ఇ. మర్థన్ అలీ, ప్రాజెక్ట్ ఇ.ఇ., డి.ఇ.లు, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.