రోగులకు నాలుగు చక్రాల సైకిళ్లు పంపిణీ..


Ens Balu
1
Guntur
2021-06-26 11:53:57

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలోని రోగులకు డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ   నాలుగు చక్రాల సైకిళ్ళు ఇచ్చేందుకు ముందుకు రావడం చాలా అభినందించదగ్గ విషయమని సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు.  శనివారం డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ ద్వారా జీజీహెచ్ లో రోగులకు  నాలుగు చక్రాల సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంలో  జెసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్నిటీ డ్రై ఫౌండేషన్  సంస్థ కోవిడ్ -19 రోగులను దృష్టిలో పెట్టుకుని కోవిడ్, నాన్ కోవిడ్ రోగుల కొరకు 20 నాలుగు చక్రాల సైకిళ్ళు అందజేసి దాతృత్వాన్ని చాటుకుందని అన్నారు.  జిల్లాలో దాతలు ముందుకు వచ్చి రోగులకు  ఏ రకమైన సహాయం అందించినా,  వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.  జీజీహెచ్ లో వివిధ రకాల చికిత్సలు  పొందే రోగులు ఉన్నారని, ఆ రోగుల యొక్క అవసరాన్ని గుర్తించి పెద్ద మనస్సుతో సహాయపడగలరని ఆయన సూచించారు.  డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ  జిల్లాలోని కొన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఇలాంటి నాలుగు చక్రాల సైకిళ్ళ ను అందించడం జరుగుతుందన్నారు.  జీజీహెచ్  నోడల్ మరియు మానిటరింగ్ అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మధుసుధనరావు ను నియమించినట్లు తెలిపారు. స్వచ్చంధంగా  రోగులను ఆదుకునేందుకు ఎవరైన  దాతలు ముందుకు వచ్చినట్లైతే వారిని  సంప్రదించాలన్నారు.  

  డిగ్నిటీ డ్రై ఫౌండేషన్ సంస్థ ముఖ్య కార్య నిర్వహణాధికారి రీనా గ్రేస్ మాట్లాడుతూ, ఈ సంస్థకు ఇతర దేశాల నుండి కూడా దాతలు సహాయం చేయడం జరుగుతుందని, అలానే సహాయం అందించే దాతలు టోల్ ఫ్రీ నెంబర్ 18005470071 ను  సంప్రదించవచ్చన్నారు.  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని రోగులకు సంబంధించి  మెడికల్ మరియు ఏమైనా అవసరాలు అందించడానికి సంస్థ సిద్దంగా ఉందన్నారు. సంయుక్త కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ సూచించిన మేరకు జిల్లాలో రోగులకు  చేతనైనంత సహాయ సహకారాలు అందించే ప్రయత్నం జరుగుతుందని  ఆమె తెలిపారు.  కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎన్. ప్రభావతి,  జూవెనెల్ ప్రొటెక్షన్  ప్రొడక్షన్ అధికారి  విజయ కుమార్, ఆసుపత్రి డాక్టర్స్, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.