నగర పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. శనివారము ఆమె జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలిసి, భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఆయన వచ్చే మార్గం విశాఖపట్నం విమానాశ్రయం నుండి పోర్ట్ గెస్ట్ హౌస్ వరకూ, చుట్టుప్రక్కల ఉన్న పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ భారత ఉపరాష్ట్రపతి వచ్చే మార్గంలో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని, గ్రీన్ బెల్ట్ లో ఉన్న మొక్కలను కట్ చేసి అందంగా ఉండే విధంగా చూడాలన్నారు. పరిపాలనా రాజధాని త్వరలో విశాఖపట్నం వస్తున్న తరుణంలో నగరాన్ని మరింత సుందరంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని, రోడ్డుకిరువైపులా డస్ట్ బిన్లు ఉన్నాయని, ప్రజలు చెత్తను రోడ్డుపై వేయకుండా డస్ట్ బిన్లలోనే వేయాలని సూచించారు. గ్రీన్ బెల్ట్ ఏరియాలోని ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురికాకుండా చూడాలని, ప్రతి దుకాణం ముందు మూడు డస్ట్ బిన్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, పర్యవేక్షక ఇంజినీరు వినయ్ కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, సుధాకర్, శ్రీనివాస్, గణేష్ కుమార్, సిటీ వెటర్నరి డాక్టర్. కిషోర్, ఎఎంఒహెచ్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.