కరోనా కేసులు కొంతమేర తగ్గినా ట్రేసింగ్, టెస్టింగ్ విషయాల్లో ఏమాత్రం అలసత్వం వహించడానికి లేదని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులకు స్పష్టం చేశారు. శనివారం ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు, హౌసింగ్‌బోర్డు కాలనీ, మరాఠిపాలెం, కబాడిపాలెం, క్లౌపేట వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఆయా సచివాలయాల పరిధిలో కరోనా కేసులు నమోదవుతున్న తీరు, నియంత్రణ
చర్యలను అమలు చేస్తున్న పద్ధతి, కరోనా ప్రొటోకాల్ పాటిస్తున్న వి ధానంపై ఆయన ఆరాతీశారు. తమ పరిధిలో ఇప్పటికీ 94 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు హౌసింగ్ బోర్డు సచివాలయ అధికారులు ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. 89 మంది కరోనా బాధిత ులను హోంఐసోలేషన్‌లో పెట్టామని చెప్పారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పాజిటివిటీ రేటు జిల్లాలో ఇప్పటికీ ఐదుశాతానికి పైగా ఉందని, ఇది ఆందోళన కలిగించే అంశమేనన్నారు. కరోనా నియంత్రణకోసం ప్రజల్లో మరింత అవగాహన కలిగించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. స్థానిక ప్రజలు ఇతర ప్రాంతాలకు సాగిస్తున్న రాకపోకలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా 45 సంవత్సరాలు పైబ డిన వారందరికీ త్వరగా వ్యాక్సిన్ వేయాలని అన్నారు. కరోనా అనుమానితులను గుర్తించడానికి ప్రస్తుతం జరుగుతున్న ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టంచేశారు. కరోనా నిబంధ నలు పాటించాలని, అనుమానిత లక్షణాలు ఉంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకువచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా కేంద్రాల వివరాలను వాలంటీర్ల ద్వారా ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వై.ఎస్.ఆర్. బీమా పథకానికి అర్హులను త్వరగా గుర్తించాలని చెప్పారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందించాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కె. భాగ్యలక్ష్మి, మున్సిపల్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు, కోవిడ్ నోడల్ ఆఫీసర్ రమాదేవి, ఆయా యు.హెచ్.సి.ల డాక్టర్లు, తదితరులు ఉన్నారు.