మెగా గ్రౌండింగ్ మేళా డేస్ పక్కాగా జరగాలి..


Ens Balu
3
Anantapur
2021-06-26 12:19:05

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లులో భాగంగా చేపట్టిన "మెగా గ్రౌండింగ్ మేళా డేస్" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని, జిల్లాకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల గ్రౌండింగ్ ను పూర్తిస్థాయిలో 100 శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న డిపిఆర్సీ భవనంలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు కింద ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి మెగా గ్రౌండింగ్ మేళా డేస్ పై ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్ తో పాటు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని, ఇందులో భాగంగా జూలై 1, 3, 4 తేదీలలో రోజుకు 10 వేల చొప్పున జిల్లాకు కేటాయించిన 30 వేల ఇళ్ల గ్రౌండింగ్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులంతా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటిదశలో 1,11,099 ఇల్లు మంజూరు కాగా, జూలై 8,9 తేదీలలో ఆషాడ మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జూలై 1వ తేదీన 10 వేలు, 3న 10 వేలు, 4వ తేదీన 10 వేలు చొప్పున మొత్తం 30 వేల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తిచేయాలని, సంబంధిత అన్ని శాఖల అధికారులు ఒక ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఇళ్ల గ్రౌండింగ్లో లబ్ధిదారులను తీసుకురావాలని, లబ్ధిదారులు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు ఇళ్ల గ్రౌండింగ్ కు మార్కింగ్ ఇవ్వాలన్నారు. పనులన్నీ ఎర్త్ వర్క్ వరకు జరగాలన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన ఇసుక, సిమెంట్ అంతా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్, వాలంటీర్లు గ్రౌండింగ్ అయిన ఇళ్లతో ఫోటోలు తీసి ఖచ్చితంగా సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ రోజు సంబంధిత లబ్ధిదారులు ఎంతో కీలకమని, తప్పనిసరిగా వారు వచ్చేలా చూసుకోవాలన్నారు. అవసరమైతే లబ్ధిదారులకు వాహనం ఏర్పాటు చేసి రవాణా సౌకర్యం కూడా కల్పించాలన్నారు. సంబంధిత లబ్ధిదారులు రాకపోతే ఇళ్ల గ్రౌండింగ్ చేయరాదన్నారు. ఇందుకు సంబంధించి నియోజవర్గ స్థాయి స్పెషలాఫీసర్ లతో సంబంధిత ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ఇళ్ల గ్రౌండింగ్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహాయం తీసుకోవాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ సమయంలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా లేఔట్లో ఉండాలన్నారు.

పెద్ద ఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో గ్రామస్థాయి స్పెషల్ ఆఫీసర్లకు, లేఔట్ స్పెషల్ ఆఫీసర్లకు షెడ్యూల్ ప్రకారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 28వ తేదీన మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లకు, నియోజకవర్గ స్థాయి స్పెషల్ ఆఫీసర్లకు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈనెల 29వ తేదీన సచివాలయ స్థాయిలో సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 30వ తేదీన లబ్ధిదారులకు వాలంటీర్లు ఇళ్ల గ్రౌండింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఇళ్ల గ్రౌండింగ్ ను పూర్తి చేయాలన్నారు. 1వ తేదీన ఎంత మంది గ్రౌండింగ్ చేస్తున్నారో ఈనెల 29వ తేదీనే తెలిసేలా ముందుగానే చూసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని లేఔట్ల వద్ద మాస్కులను అందుబాటులో ఉంచాలన్నారు.

ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు లేఔట్లలో నీటి వసతి ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, ఏపీఎస్పిడిసిఎల్ ఎస్ఈని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లు తమ పరిధిలోని మండల స్థాయి అధికారులతో నీటి వసతి, విద్యుత్ సరఫరాపై నిర్వహించాలన్నారు. అర్బన్ లేఅవుట్లలో నీటి సరఫరా చేయాలని పబ్లిక్ హెల్త్ ఎస్ఈని ఆదేశించారు. డిఆర్డిఎ పిడి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లు సంబంధిత బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు ఆర్థికంగా సహాయం చేసేలా చూడాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ లక్ష్యాలను పూర్తి చేస్తే సంబంధిత అధికారులను అభినందిస్తూ అవార్డులు అందజేస్తామని, మండలాల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారని, ఇందులో భాగంగా జూలై 1, 3, 4 తేదీలలో మెగా గ్రౌండింగ్ మేళా డేస్ లో భాగంగా పెద్ద ఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ చేపట్టాలన్నారు. మండల, నియోజకవర్గ స్థాయి వారిగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈనెల 28వ తేదీ కల్లా ఏ రోజు ఎంత మంది గ్రౌండ్ చేస్తారు అనే జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ రోజు ఉదయం 10:30 గంటల కల్లా పూర్తయ్యేలా చూడాలన్నారు. నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు మండల స్పెషల్ ఆఫీసర్ లతో మాట్లాడాలని, ప్రతి ఒక్కరికి వారు చేయాల్సిన కార్యక్రమాలపై పూర్తి స్పష్టత ఉండాలన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సిరి మాట్లాడుతూ మెగా గ్రౌండింగ్ మేళా డేస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు ఇళ్ల గ్రౌండింగ్ గురించి వాలంటీర్లు లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మెగా గ్రౌండింగ్ మేళా డేస్  కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జూలై 1, 3, 4 రోజున ఎవరెవరు ఏ ఏ రోజుల్లో ఇళ్ల గ్రౌండింగ్ చేస్తారు అనేది లబ్ధిదారుల జాబితా ముందుగానే తయారు చేయాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. ఇందులో భాగంగా మార్కింగ్ ప్రక్రియను ఒకరోజు ముందుగానే చేపడతారని, ఇళ్ల గ్రౌండింగ్ చేసినప్పుడే జియో ట్యాగింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ వరకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ వెంకటరమణ, పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ శ్రీనాథ్, ఎల్డిఎం మోహన్ మురళి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆర్ డి వో లు నిశాంత్ రెడ్డి, మధుసూదన్, గుణ భూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, హౌసింగ్ డి ఈలు, ఏఈ లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.