మా సమస్యలు పరిష్కరించండి సారూ..


Ens Balu
4
Kakinada
2021-06-26 12:38:54

విశాఖ ఫిష్ లాండింగ్ సెంటర్ లో బోట్లు నిలిపివేత, ఉత్పత్తుల అమ్మకాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాకినాడ అర్బన్ మండలం దుమ్ములపేట, పర్లోపేట గ్రామ టూనా ఫిష్టింగ్ ఫైబర్ బోట్ ఓనర్స్ శనివారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు.  కాకినాడ రేవుకు తిన్నగా సుదూర జలాల్లో వేట సాగిస్తున్నపుడు నీటి వడిని బట్టి తమ బోట్ లు ఇటు తమిళనాడు లేదా అటు ఓడిస్సా వైపు వెళ్లిపోతాయని అక్కడి నుండి తిరిగి కాకినాడ వచ్చేలోపు ఆయిల్ అయిపోవడం, చేపలు కుళ్లిపోవడం జరుగుతోందన్నారు.  అందువల్ల ఒడిస్సా తీర జలాల ఉన్నపుడు సమీపంలోని విశాఖపట్నం ఫిష్షింగ్ హార్బర్ లో బోట్లు పెట్టుకుని, వేట చేపలు అమ్ముకుని  గత 40 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, అయితే ఇటీవల కాలంలో స్థానికంగా కొంత మంది దౌర్జన్యకారులు తమను చంపుతామని బెదిరిస్తూ, విశాఖపట్నం ఫిష్షింగ్  హార్బర్ లోకి తమ బోట్లను రానీయ కుండా తరిమేస్తున్నారని జిల్లా మత్స్యకారులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అందువల్ల జీవనోపాధి కోల్పోయి బోట్లు అమ్ముకునే స్థితిలో ఉన్నామని, దౌర్జన్యకారులపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలని జిల్లా మత్స్యకారులు ఆయనను వేడుకున్నారు. వారి విజ్ఞాపనపై మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ, పొరుగు జిల్లాల్లోని ఫిష్ లాండింగ్ హార్బర్లలో జిల్లా మత్స్యకారులకు ఎదురౌతున్న సమస్యలపై ఆయా జిల్లాల అధికారులు, రాష్ట్ర అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలియజేశారు.  అలాగే కెఎస్ఈ జడ్ లో సేకరించిన భూముల తిరిగి అప్పగింత ప్రక్రియలో తమ సమస్యలను, విజ్ఞాపనలను పరిగణలోకి తీసుకోవలని ఎస్ఈజడ్ రైతులు కోరుతూ శనివారం మంత్రి కన్నబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి విన్నపం సమర్పించారు.  రైతుల సమస్యలను, వినతులను పరిశీలించి తగు పరిష్కారం అందించాలని ఎస్ఈజడ్ అధికారులు, ఆర్డిఓలకు సూచిస్తామని మంత్రి కన్నబాబు  తెలిపారు.