శ్రీకాకుళంజిల్లాలో కోవిడ్ మూడవ దశ వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులతో పాటు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్స్, ఇతరత్రా ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ మూడవ దశపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ మూడవ దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన విధంగా ఆసుపత్రులలో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతరత్రా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతీ ఆసుపత్రి , నర్సింగ్ హోమ్ మినిమమ్ స్టాండర్స్ ఎక్విప్ మెంట్ , ఫర్నిచర్ కలిగి ఉండాలని సూచించారు. యాభై నుండి వంద పడకల గల ఆసుపత్రులు మరియు వంద పడకల గల ఆసుపత్రుల్లో 100 ఆక్సిజన్ సిలిండర్లు ఉండాలని చెప్పారు. 50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రి, నర్సింగ్ హోమ్ లలో 40 ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతీ బెడ్ కు ఆక్సిజన్ మాస్కుతో పాటు రెగ్యులేటర్ కూడా ఉండాలని జె.సి వివరించారు. పి.ఎస్.ఎ ఆక్సిజన్ ప్లాంటులు ఉన్నఆసుపత్రులలో ప్రతీ 100 పడకలకు 1000ఎల్.పి.ఎం ( లీటర్ పర్ మినిట్ ), 50 నుండి 100 పడకలు కలిగిన వాటికి 500 ఎల్.పి.ఎం, 50 కంటే తక్కువ పడకలు గల ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. 50 పడకల కంటే ఎక్కువ గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు లేదా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతమున్న వెంటిలేటర్ల సంఖ్య కంటే 50 శాతం అదనంగా పెంచాలని అన్నారు. 100 పడకలు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 20 శాతం పడకలను ICU పడకలుగా మరియు 80 శాతం పడకలను నాన్ ఐసియు పడకలుగా కేటాయించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అనుమతి పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో దాదాపు పడకల సంఖ్యతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, లేని ఆసుపత్రుల్లో వాటిని ఏర్పాటుచేసుకోవాలని, వీటితో పాటు ప్రభుత్వం సూచించిన అన్ని వసతులు ఏర్పాటుచేసుకోవాలని జె.సి ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి.చంద్రనాయక్. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సమన్వయకర్త డా.ప్రకాశరావు, డా. కె.సునీల్ నాయక్, కిమ్స్, సింధూర, మెడికవర్, పి.వి.యస్.రామ్మోహన్ రావు, జెమ్స్, బగ్గు సరోజిని, గొలివి, అమృత, జిఎంఆర్ ఆసుపత్రుల యాజమాన్యాలు మరియు కమల, లైఫ్, సూర్యముఖి, ట్రస్ట్, యునిక్, ఎ-వన్, సన్ రైజ్, వాసంతి, నారాయణ మల్టిస్పెషాలిటీ, ద్వారకమాయి, ఎస్.పి.వి ఆసుపత్రుల అధినేతలు పాల్గొన్నారు.