విశాఖ జిల్లాలో గృహనిర్మాణ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది ప్రణాళికాయుతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ “నవరత్నాలు –పేదలందరికి ఇళ్లు” మెగా గ్రౌండింగ్ మేళా పై జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం, అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్హులైన పేదలందరికి ఇళ్లు కట్టించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమం అమలులో హౌసింగ్ శాఖ సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు జిల్లా మరియు మండల స్థాయిలలో పని చేసి విజయవంతం గావించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల రెడ్డి విశాఖ డివిజన్, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, అనకాపల్లి డివిజన్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) కల్పనా కుమారి నర్సీపట్నం డివిజన్, జి.వి.ఎం.సి కమిషనర్ డా.జి.సృజన జి.వి.ఎం.సి పరిధిలో పేదలందరికి ఇళ్ల కార్యక్రమానికి ఇన్ చార్జిలుగా ఉంటారన్నారు. తదుపరి ప్రతి నియోజక వర్గానికి డిప్యూటి కలెక్టర్ స్థాయి అధికారిని, మండల స్థాయిలో మండల ప్రత్యేకాధికారిని నియమించడం జరిగిందన్నారు. అదే విధంగా మండలాల్లోని కొన్ని సచివాలయాలకు ఒక అధికారిని నియమించడం జరుగుతుందని, చివరిగా లే-అవుట్ స్థాయిలో సచివాలయ స్థాయి సిబ్బందిని బాధ్యులుగా నియమించడం జరుగుతుందన్నారు. ఈ ఐదు అంచెల ఎడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ లో ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలన్నారు. ఈ మెగా గ్రౌండింగ్ మేళాకు తేదీల వారీగా చేపట్టవలసిన పనులను వివరించారు. 26వ తేదిన జిల్లా అధికారులు, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహణ, 28వ తేదీన మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయిలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ, ప్రజా ప్రతినిధులతో సమావేశాల నిర్వహణ, యాక్షన్ ఫ్లాన్ తయారు గావించుట. 29వ తేదిన సచివాలయాల స్థాయిలో శిక్షణ , 30వ తేదీన వాలంటీర్లు లబ్దిదారులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిర్దిష్టంగా నిర్వహించాలని అన్నారు. జూలై 1వ తేదీన గ్రౌండింగ్ మేళాకు శత శాతం లబ్దిదారులు హజరు కావాలని, దీనికి గాను ప్రతి ఒక్కరూ సూక్ష్మ స్థాయిలో ప్రణాళికతో పని చేయాలని స్పష్టం చేశారు .
జాయింట్ కలెక్టరు ఎం.వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. అందరికీ అందుబాటులో వీలును బట్టి లే అవుట్ దగ్గరలోనే ఇసుకను వుంచుతామని చెప్పారు. ప్రతి మండలంలో ఒక ఇసుక డిపోను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్లు, ఎం .వేణుగోపాల రెడ్డి, పి. అరుణ్ బాబు, జి.వి.ఎం .సి కమిషనర్ డా. జి.సృజన, జాయింట్ కలెక్టరు (హౌసింగ్) కల్పనా కుమారి, హౌసింగ్ ప్రాజెక్టు డైరక్టర్ శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారులు హాజరైయ్యారు.