రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం వజ్రపుకొత్తూరు మండలం పిఎసిఎస్ నూతన అధ్యక్షులుగా దువ్వాడ హేంబాబు చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత పిఎసిఎస్ కమిటీలు తీసుకోవాలని అన్నారు. నూతనంగా పదవి చేపడుతున్న దువ్వాడ హేంబాబు చౌదరి సర్ధవంతంగా పనిచేస్తాడని నమ్ముతున్నాను అని అన్నారు. వజ్రపుకొత్తూరు మండలంలో ఉద్దాన, పల్లపు ప్రాంత రైతులు ఉన్నారని వారి అభివృద్దికి తోడ్పడుతూ ముందుకు పోవాలని అన్నారు.ఇటీవల ప్రభుత్వం నష్టపోయిన రైతులకు 10.50 కోట్లు రూపాయలు అందించిన విషయం గుర్తు చేశారు. ఉద్దాన ప్రాంతంలో జీడి రైతులకు మేలు జరిగేలా ఫార్మర్ ప్రొడక్ట్స్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులు సంఘాలుగా ఉన్నారని తెలిపారు. ఏఫ్.పి.ఒ, పిఎసిఎస్, మార్కెట్ కమిటీలు సమన్వయంతో రైతుల సమస్యలు తెలుసుకుని మరింత ప్రభుత్వ సంక్షేమం అందించాలని కోరారు.రైతుకు విత్తనాలు, ఎరువులు, నీరు సకాలంలో అందించే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. రైతు విత్తనం వేసే దశ నుండి పంట చేతికి వచ్చే వరకు ఆర్.బి.కె ల ద్వారా రైతుకు భరోరాసా కల్పిస్తున్నమని అన్నారు.
వజ్రపుకొత్తూరు శివారు భూములకు ఈ ఏడు సాగు నీరు అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాము అని అన్నారు. ఈ ఏడాది రైతు రుణాలు పిఎసిఎస్ ల ద్వారా అధిక శాతం లబ్ధిదారులకు అందించి రైతు పంట ఉత్పత్తిని పెంచే దిశగా పిఎసిఎస్ లు పనిచేయాలని కోరారు. ప్రతి పిఎసిఎస్ పరిధిలో 5 వందల మెట్రిక్ టన్నుల గొడాములు నిర్మిస్తున్నామని వాటికి త్వరలో టెండర్లు కూడా వేస్తామని తెలిపారు. అంతే కాకుండా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రైతుకు సబ్సిడి, రైతు భీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ప్రతి రైతుకు మేలు జరిగేలా సర్పంచ్ లు ,ఎంపిటిసి అభ్యర్ధులు కలిసి రైతుకు చేయూత కావాలని అన్నారు. సాగు నీరు ఇబ్బందులు ఉండకుండా వంశధార చానల్స్ అన్ని మరమ్మత్తులు చేయించుకున్నామని అన్నారు. అంతే కాకుండా గ్రామాల్లో మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావడానికి అముల్ ప్రాజెక్టు ద్వారా గ్రామాల్లో సొసైటీలు పెడతాం అని అన్నారు. వారికి కూడా డిసిసిబి, పిఎసిఎస్ ద్వారా రుణాలు మంజూరు చేసే అవకాశం ఉంటుంది అని అన్నారు. వైఎస్ఆర్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనకు అందరం కలిసి పని చేయాలని అన్నారు.
వజ్రపుకొత్తూరు పిఎసిఎస్ అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన దువ్వాడ హేంబాబు చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు తనపై నమ్మకం ఉంచి పిఎసిఎస్ బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన నమ్మకాలను వమ్ము చేయకుండా ప్రతి రైతుకు ప్రభుత్వం అందించే సంక్షేమం, అభివృద్ధి అందిస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో గురయ్యనాయుడు, పలాస నియోజకవర్గం మార్కెట్ కమిటీ ఛైర్మన్ పివి సతీష్, స్థానిక నాయకులు హనుమంతు వెంకటరావు దొర, భాస్కరరెడ్డి, ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, కోత పూర్ణచంద్రరావు, సర్పంచ్ లు, ఏంపిటిసి అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు.