ప్లాస్మాదానం చేయండి ప్రాణదాతలు కండి..


Ens Balu
5
శ్రీకాకుళం
2020-09-01 19:16:17

శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు పిలుపునిచ్చారు. జిల్లాలో రోజురో జుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా మరణాలను నియంత్రించేందుకు ప్లాస్మాథెరపీ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్లాస్మాలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్ కేవలం కొన్ని రోజులే యాక్టివ్ గా ఉంటాయని, కాబట్టి ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగ తి ఎవరూ మరిచిపోకూడదన్నారు. మంగళవారం  రాజాంలో జిల్లా రెడ్ క్రాస్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు హాజరై జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పెంకి చైతన్య ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇదేస్పూర్తితో కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. తద్వారా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న వారిని రక్షించేందుకు వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేసారు. రాజాంలో ప్లాస్మాదానం చేయాలనేవారు 9441708120, 9440131160 మొబైల్ నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  సెట్ శ్రీ మేనేజర్ బి.వి.ప్రసాదరావు, రాజాం సబ్ బ్రాంచ్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ , కె.శంకర్రావు, కె సత్యనారాయణ, బి శ్రీధర్, విజయ్ బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు