అమలాపురం నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీఓ ఎన్ ఎస్ వి బి వసంతరాయుడు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో కెయిర్న్ ఎనర్జీ, వేదాంత , పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, ఆర్&బి అధికారులతో ప్రతీ సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న సిఎస్ఆర్ నిధుల వినియోగం, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై మంత్రి విశ్వరూప్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను నివారించడానికి సిఎస్ఆర్ నిధుల వినియోగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని అన్నారు. నియోజకవర్గంలోని తీర ప్రాంతాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజా ఉపయోగకరమైన త్రాగునీరు, రోడ్లు, కల్వర్టులు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులపై మంత్రి సమీక్షించారు. ఇందులో కొన్ని పనులు పూర్తవగా, కొన్ని పనులు ప్రగతిలో ఉండగా, కొన్ని పూర్తి కాలేదు. అలాగే ప్రారంభం కాని పనులపై సమీక్షించి అందుకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ ఇ జి ఎస్ తో ముడిపడి ఉన్నాయని నిధులు నిలిచిపోవడం వలన ఆ పనులు నిలిచిపోయాయని పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు మంత్రి విశ్వరూప్ కు వివరించారు. అనంతరం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సిఎస్ఆర్ నిధులు రూ.10 కోట్ల 93 లక్షలతో చేపట్టనున్న పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించి, తక్షణమే పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతీ మూడు నెలలకొకసారి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించి, సంబంధిత పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకుని రావాలని మంత్రి విశ్వరూప్ కోరారు.
ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్ ఈఈ కె. చంటిబాబు, డిఈఈ రాజ్ కుమార్, ఆర్ డబ్ల్యూ ఎస్ డిఇఇ ఎన్. పార్థసారధి, సిపివో బాలాజీ, వేదాంత, కెయిర్న్ ఎనర్జీ అధికారులు కె.శ్రీహరి,సతీష్, పాషా, ఆర్&బి అధికారులు, ఉప్పలగుప్తం తహశీల్దార్ ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.