ప్రభుత్వ శాఖలన్నీ కలిసికట్టుగా, సమర్థవంతంగా కృషి చేయడం వల్లే, జిల్లాలో కోవిడ్‌పై విజయం సాధించామని కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై పోరులో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతీఒక్కరినీ ఆయన కొనియాడారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యమిత్రలు అందించిన సేవలను ప్రశంసించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అభినందన సభ కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ను, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్‌వి రమణకుమారిని, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావును ఘనంగా సత్కరించారు. ఆరోగ్య మిత్రలకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మాట్లాడుతూ, కోవిడ్ నియంత్రణలో విజయనగరం జిల్లా ఇతర జిల్లాలకు దిక్సూచిగా మారిందన్నారు. పరిమిత వనరులున్నప్పటికీ, ప్రతీఒక్కరూ తమ శక్తికి మించి పనిచేశారని ప్రశంసించారు. అందువల్లే కోవిడ్ చికిత్సలో గానీ, మరణాలను తగ్గించడంలో గానీ మన జిల్లా, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే అతితక్కువ పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాగా మారామని చెప్పారు. జిల్లాలో కోవిడ్ సమయంలో ఆక్సీజన్ కొరత రాకుండా చేయడంలో, జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఆసుపత్రులు, పడకల యాజమాన్యంలో జాయింట్ కలెక్టర్ వెంకటరావు సమర్థవంతమైన సేవలను అందించారని అభినందించారు. డిఎంఅండ్‌హెచ్ఓ, డిసిహెచ్ఎస్ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు. వేక్సినేషన్‌లో కూడా మన జిల్లా రికార్డు సాధించిందని, 5 ఏళ్లు లోపు పిల్లలున్న తల్లులు 94 శాతం మందికి వేక్సినేషన్ పూర్తి చేసి, రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచామని తెలిపారు. కోవిడ్ మూడోదశ వస్తే ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందని కలెక్టర్ చెప్పారు.
జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, కోవిడ్‌ను అదుపుచేయడంలో ప్రతీఒక్కరూ అంకితభావంతో పనిచేశారని అభినందించారు. మనది పేదల జిల్లా కావడంతో, సుమారు 83 శాతం మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కోవిడ్ వైద్యం అందించి, వారి ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. వైద్య సేవలు అందించే క్రమంలో ఆర్థికంగా ఎటువంటి ఆరోపణలు రాకుండా, ఆరోగ్యమిత్రలు చక్కని పనితీరు కనబరిచారని కొనియాడారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ యు.అప్పలరాజును కలెక్టర్ చేతులమీదుగా సన్మానించారు. కార్యక్రమంలో టీమ్ లీడర్లు బి.సురేష్, టి.జనార్థన్, ఏ. భాను, నారంనాయుడు, ఉమా, దేవి, ఆరోగ్యమిత్రలు పాల్గొన్నారు.