పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో ఇళ్లు మంజూరైన లబ్దిదారుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారం అందించడం ద్వారా వారంతా మెగా గ్రౌండింగ్ మేళాలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కోరారు. జిల్లాలోని మునిసిపల్ పాలకవర్గ ప్రతినిధులతో కలెక్టర్ సోమవారం టెలి కాన్పరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని సూచించారు. జిల్లాలో జూలై 1, 3, 4 తేదీల్లో మెగా గ్రౌండింగ్ మేళాలు నిర్వహిస్తున్నామని మొదటి రోజునే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా తమ వార్డు పరిధిలోని లబ్దిదారులను ప్రోత్సహించాలన్నారు. పట్టణానికి దూరంగా లే అవుట్‌లు ఉన్నచోట అక్కడకు లబ్దిదారులు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, మంగళ, బుధవారాల్లో ఆయా లబ్దిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లను, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఏవిధంగా సహాయపడుతుందో వారికి వివరించాలని కోరారు. జూలై 1న ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు అవసరమైన పూజా సామాగ్రి, టెంట్‌లు వంటి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. లే అవుట్లకు లబ్దిదారులను తీసుకువెళ్లి వారికి సంబందించిన స్థలంలో ఇంజనీరింగ్, టెక్నికల్ అసిస్టెంట్‌ల సహకారంతో స్థలంలో మార్కింగ్ చేయించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, నీరు, ఇటుక వంటి ఇళ్ల నిర్మాణ సామాగ్రిని సిద్దం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో 98 వేల మందికి ఇళ్లస్థలాలు మంజూరు చేయడం జరిగిందని, ఇందులో 75 వేల ఇళ్లను రెండు దశల్లో నిర్మాణం చేసుకోవలసి వుందన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులను ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్టు కలెక్టర్ చెప్పారు.
జిల్లాలోని పట్టణాల్లో నిర్మిస్తున్న ఇళ్లలో 70శాతం విజయనగరం పట్టణంలోనే నిర్మిస్తున్నామని, అతి పెద్ద లే అవుట్ అయిన గుంకలాంలో ఇద్దరు అధికారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్ కె.సుబ్బారావుకు మూడు బ్లాకులు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్‌కు మూడు బ్లాకులు అప్పగించామన్నారు.
జిల్లాలో మెగా గ్రౌండింగ్‌మేళాలపై జిల్లాస్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. సిపిఓ కార్యాలయంలో ఈ కంట్రోల్ రూం ఏర్పాటవుతుందని, ప్రతి గంటకూ జరిగిన గ్రౌండింగ్ వివరాలతో రాష్ట్ర స్థాయికి సమాచారం అందించడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలులో జిల్లా మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తోందని, అత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధుల, అధికారుల సహకారంతో మొదటిస్థానంలో నిలుస్తామనే విశ్వాసాన్నివ్యక్తం చేశారు.
టెలికాన్ఫరెన్సులో జాయింట్ కలెక్టర్‌లు డా.మహేష్ కుమార్, మయూర్ అశోక్, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, మునిసిపల్ చైర్ పర్సన్‌లు, కమిషనర్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్‌లు పాల్గొన్నారు.