మెగామేళాలో జిల్లాలక్ష్యం 75 వేల ఇళ్లు..


Ens Balu
1
Vizianagaram
2021-06-28 12:52:43

 నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు క్రింద చేపడుతున్న గృహ  నిర్మాణాల మెగా మేళా లో వ్యవసాయ, ఆరోగ్య  శాఖలు తప్ప మిగిలిన శాఖలన్నిటిని భాగస్వామ్యం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు.  జిల్లా కు 75 వేల గృహాలను లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని,   అధికారులు  వారి లక్ష్యాలను సాధించి తమ సమర్ధతను చూపించుకోవాలని అన్నారు.  లక్ష్యాలను సాధించని వారి పై చర్యలు తప్పవని ఈ సందర్భంగా  హెచ్చరించారు. సోమవారం సంయుక్త కలెక్టర్లతో కలసి  కలెక్టర్ మండల బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఇంకా రెండు రోజులే  గడువు ఉన్నందున కార్యక్రమ నిర్వహణకు అవసరమగు ఏర్పాట్లను , కార్యాచరణ ప్రణాళికలను తయారు చేసుకొని సన్నద్ధంగా  ఉండాలని ఆదేశించారు.  జూలై 1 వ తేదీనే మొత్తం గ్రౌండ్ అయ్యేలా ప్రణాళికలు వేసుకోవాలని, వీలు కాని వారు మాత్రమే  మిగిలి ఉండాలని, వారివి  3, 4  తేదీలలో పూర్తి చేయాలనీ అన్నారు. లబ్ది దారులను వారికీ  కేటాయించిన ప్లాట్  వద్దకు తీసుకు రావడం, ప్లాట్ మార్కింగ్ చేయడం, భూమి పూజల కు కావలసిన సామగ్రిని  , ఇసుక, సిమెంట్, ఇటుక తదితర ఏర్పాటు చేయడం,  ఈ కార్యక్రమాన్ని ఫోటో తీసి యాప్ లో అప్ లోడ్ చేయడం ముఖ్యమైన పని అన్నారు.  లబ్ది దారులు  100 మంది కంటే ఎక్కువ వున్న చోట షామియానా ఏర్పాటు చేయాలన్నారు.  ఈ ప్రరంభాలను  ముఖ్యమంత్రి కార్యాలయం నుండి గంట గంటకు పర్యవేక్షించే ఏర్పాటు చేసారని, అదే విధంగా జిల్లా నుండి సి.పి.ఓ కార్యాలయం నుండి ఒక బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు.  అనంతరం  సంయుక్త కలెక్టర్లు డా. కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్, అశోక్ మయూర్  లు తమ సలహాలను, సూచనలను అందించారు. 
 జిల్లాకు ప్రత్యేకాధికారి నియామకం : 
జిల్లాకు ప్రత్యెక పర్యవేక్షణాధికారిగా సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి  సాల్మన్ ఆరోఖ్య రాజ్ ను  ప్రభుత్వం నియమించిందని , వారు ఎక్కడైనా  ఎప్పుడైనా ఆకష్మికంగా తనిఖీ చేయవచ్చునని కలెక్టర్ అన్నారు.  అదే విధంగా జిల్లా నుండి జే.సి (రెవిన్యూ) గజపతి నగరం,  బొబ్బిలి  నియోజక వర్గాలకు, జే.సి అభివృద్ధి డా. మహేష్ కుమార్ ను నెల్లిమర్ల, చీపురుపల్లి, జే.సి ఆసరా జే. వెంకట రావు కు సాలూరు నియోజక వర్గానికి ఇంచార్జ్ లుగా నియమించామన్నారు. జే.సి హౌసింగ్ మయూర్ అశోక్ ను విజయనగర, ఎస్.కోట  నియోజకవర్గాలకు కేటాయించగా , ఐ టి డి ఎ ప్రోజ్ర్ట్ అధికారి కుర్మనాద్ ను పార్వతి పురం, కురుపాం నియమించడం జరిగిందన్నారు.  వీరితో పాటు  ప్రతి నియోజక వర్గానికి ఒక సీనియర్ జిల్లా అధికారిని ఇంచార్జ్ గా నియమించామన్నారు. మండల ప్రత్యేకాధి కారులు  ఆయా ఇంచార్జ్ లకు రిపోర్ట్ చేయవలసి ఉంటుందని, ఏదైనా  సమస్య వస్తే సంబంధిత  ప్రత్యేకాధికారిని సంప్రదించాలని అన్నారు. 
ప్రజా ప్రతినిధులు సహకరించాలి:
 పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక అని, ఈ మెగా ప్రారంభ  మేళా కు   అత్యంత ప్రాధాన్యత నిచ్చి విజయవంతం గావించాలని   జిల్లా  కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేసారు. సర్పంచ్ లకు, మున్సిపల్ కౌన్సిలర్తో , కార్పొరేటర్లతో, శాసన సభ్యులు, ఎం.పి లతో  టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడి ప్రజా ప్రతినిధులంతా ఈ మేళా కు తప్పక హాజరు కావాలని కోరారు.   ప్రజలను చైతన్య పరచి పెద్ద సంఖ్యలో ప్రారంభాలు జరిగేలా తోడ్పడాలన్నారు.  లబ్ది దారులను వారికీ కేటాయించిన ప్లాట్ వద్దకు వచ్చేలా చేయడం లో వాలంటీర్ లకు సూచించాలని అన్నారు.   ఈ కార్యక్రమాన్ని ఎన్నికల నిర్వహణ లా, ఒక వాక్సినేషన్ కార్యక్రమం లా జరగాలన్నారు.