విజయనగరం జిల్లాలో అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు పేదల గృహనిర్మాణ కార్యక్రమాన్ని తమ సొంత కార్యక్రమంలా భావించి ఇందులో భాగస్వాములు కావడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ కోరారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వాక్సినేషన్ తరహాలో పెద్ద ఎత్తున చేపట్టాలని భావిస్తున్నారని చెప్పారు. మన జిల్లా నుంచి జూలై 1,3,4 తేదీల్లో నిర్వహించే మెగా గ్రౌండింగ్ మేళాలో తమ నియోజకవర్గాల్లో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా వారిని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో జిల్లాలోని పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహకరించాలని కోరారు. మెగా గ్రౌండింగ్ మేళాల నిర్వహణపై జిల్లాకు చెందిన ఎంపి, ఎం.ఎల్.సి., ఎమ్మెల్యేలతో కలెక్టర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ గ్రౌండింగ్ మేళా ఉద్ద్యేశ్యాలను, ఈ మేళాల్లో గృహనిర్మాణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం నిర్దేశించుకున్న లక్ష్యాలను గురించి వారికి కలెక్టర్ వివరించారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో జిల్లాలో 75వేల ఇళ్లను నిర్మించాల్సి ఉందని, జూలై 1వ తేదీన మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారని మొదటి రోజే అధిక సంఖ్యలో లబ్దిదారులతో ఇళ్ల పనులు ప్రారంభించేలా చొరవ చూపాలని సూచించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో అన్ని లే అవుట్లలో ఇప్పటికే నీటిసరఫరా, విద్యుత్ తదితర సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ తెలిపారు. పట్టణాల్లోనూ ఈనెల 30 నాటికి లే అవుట్లలో నీటి వసతి కల్పిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని, దీనికోసం ఏడు లేదా ఎనిమిది మంది లబ్దిదారులు ఒక గ్రూపుగా ఏర్పడితే వారికి ఒకేసారి అవసరమైన ఇసుక సరఫరా చేయడం జరుగుతుందన్నారు. సిమెంటు ఒక్కో ఇంటికి రూ.235 ధరతో 90 బస్తాలు అందిస్తామన్నారు. ఆయా నియోజకవర్గాల్లో లబ్దిదారులు ఇళ్లు నిర్మించుకునేలా శాసనసభ్యులు వారిని ప్రోత్సహించాలని కోరారు. ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక జాయింట్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించామని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏ సమస్య వున్నా వారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
పలువురు శాసనసభ్యులు మాట్లాడుతూ లబ్దిదారులు గ్రూపులుగా ఏర్పడి ఇళ్లు నిర్మించుకుంటేనే వారికి ఇళ్ల నిర్మాణ ఖర్చు తగ్గుతుందని, ఈ విషయంలో వారిలో అవగాహన కల్పించాల్సి వుందన్నారు. అదేవిధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టే లబ్దిదారులకు సకాలంలో అవసరమైన మేరకు సిమెంటు సరఫరా చేయాలని గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య కోరారు. నెల్లిమర్ల, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాల్లో లేఅవుట్లకు సంబంధించిన ఉన్న సమస్యలను ఆయా శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు, రాజన్నదొర, అలజంగి జోగారావు వివరించారు. సమావేశంలో ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా చేస్తారో వివరించాలని కోరారు. 7 నుంచి 8 మంది కలసి ఒక ఇండెంట్ పెట్టుకుంటే జెపి సంస్థ వారి స్థలం వద్ద వారికి సంబంధించిన ఇసుక సరఫరా చేస్తుందని హౌసింగ్ పి.డి. రమణమూర్తి తెలిపారు.
సమావేశంలో ఎం.ఎల్.సి. సురేష్‌బాబు,విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు, చీపురుపల్లి ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్‌లు డా.మహేష్ కుమార్, డా.కిషోర్ కుమార్, అశోక్ మయూర్, వెంకటరావు, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ., గనులశాఖ ఏ.డి తదితరులు పాల్గొన్నారు.