రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకానికి సంబంధించి జూలై 1,3,4 తేదీల్లో జరిగే మెగా గ్రౌండింగ్ ను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత తెలిపారు. సోమవారం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ళు పథకం కింద కొమరగిరి అర్బన్ లేఔవుట్లో నిర్వహించే మెగా గ్రౌండింగ్ పై ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్, గృహ నిర్మాణం, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఇతర శాఖల అధికారులతో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీత, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మేయర్ సుంకర పావని తిరుమల కుమార్, జాయింట్ కలెక్టర్(గృహ నిర్మాణం)ఏ. భార్గవ్ తేజ ముఖ్య అతిథులుగా పాల్గొని,అధికారులకు గ్రౌండింగ్ నిర్వహణ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ కాకినాడ పట్టణ ప్రజలకు సొంతింటి కల నెరవేర్చే విధంగా కొమరగిరి వద్ద సుమారుగా మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో వేల కోట్ల రూపాయలు వెచ్చించి లేఔవుటును సిద్ధం చేయడం జరిగిందన్నారు.ఈ లేఔవుట్ ను లెవలింగ్, ఇతర అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దటంలో పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూపిన చొరవ, కృషి మరువలేనిదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కొమరగిరి లేఔవుట్ లోనే ఈ పథకాన్ని ప్రారంభించటం గొప్ప విశేషమన్నారు. కొమరగిరి అర్బన్ లేఔవుట్ లో ఇల్ల స్థలం మంజూరైన ప్రతి ఒక్క లబ్ధిదారుడు గృహం నిర్మించుకునే విధంగా రహదారులు, త్రాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.జూలై 1,3,4 తేదీల్లో నిర్వహించే గ్రౌండింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొని, గృహ నిర్మాణ పనులు చేపట్టే విధంగా అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహించాలని వంగా గీత తెలిపారు.
పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన ప్రోత్సాహంతో కొమరగిరి అర్బన్ లేఔవుట్ లో గత సంవత్సరం డిసెంబర్ 25న అత్యంత వైభవంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. సుమారుగా మూడు వేల మంది కాకినాడ పట్టణ వాసులకు కొమరగిరి లేఔవుట్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరిగిందన్నారు.ఇల్ల స్థలం పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుడు గృహ నిర్మాణ పనులు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జూలై 1,3,4 తేదీల్లో కొమరగిరి లేఔవుట్లో గృహ నిర్మాణ పనులకు సంబంధించి జరిగే గ్రౌండింగ్ కార్యక్రమంలో ఎటువంటి సమన్వయ లోపం లేకుండా అధికారులు అందరూ సమిష్టిగా కృషిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.
జాయింట్ కలెక్టర్( గృహ నిర్మాణం) ఏ.భార్గవ్ తేజ మాట్లాడుతూ కొమరగిరి లేఅవుట్ లో జరిగే గ్రౌండింగ్ కార్యక్రమం పండగ వాతావరణం తలపించే విధంగా లబ్ధిదారులు అందరూ గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా అధికారులు అందరూ కృషి చేయాలన్నారు. కొమరగిరి అర్బన్ లేఔవుట్ లో తొలి దశ కింద 12,500 గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాకినాడ పట్టణ పరిధిలో స్వయం సహాయ సంఘాలకు సంబంధించి సుమారుగా 3038 మంది మహిళలలు లబ్ధి పొందుతున్నారు.
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ కాకినాడ పట్టణం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కొమరగిరి అర్బన్ లేఔవుట్లో మొత్తం 29 వార్డులో జులై 01న 4వ వార్డు నుంచి 13వ వార్డు పరిధిలోని వెయ్యి మందికి, 03న 27వ వార్డు నుంచి 36వ అవార్డు పరిధిలోని వెయ్యి మందికి, 04న 37వ వార్డు నుంచి 46వ వార్డు పరిధిలో ఉన్న వెయ్యి మందికి(42వ వార్డు మినహా) గ్రౌండింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు గ్రౌండింగ్ లో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కమిషనర్ తెలిపారు.
ఈ సమావేశం లో ఏడిసి సిహెచ్. నాగనరసింహారావు, హౌసింగ్ పీడీ జి. వీరేశ్వర ప్రసాద్,మెప్మా పీడీ కె.శ్రీ రమణి, వివిధ శాఖల ఇంజనీర్లు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.