ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-06-28 13:38:15

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డులో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. సోమవారం ఆమె జివిఎంసి కమిషనర్ డా. జి.సృజనతో కలిసి 3వ జోన్ 17వ వార్డులోని ఉషోదయ జంక్షన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ,  17వ వార్డులో పారిశుధ్య పనితీరు అద్వానంగా ఉందని,  శానిటరి ఇన్స్పెక్టరు, వార్డు సచివాలయ శానిటరి కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చూడాలని,  బహిరంగ ప్రదేశాలలో చెత్త వేసిన వారికి అపరాధ రుసుము వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎ.పి. ఇపిడిసిఎల్ వారు  భూగర్భఎలక్ట్రిసిటీ కొరకు తీసిన గొయ్యలను సరిగ్గా పూడ్చక పోవడం, వైర్లు పైకికనిపించే విధంగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇపిడిసిఎల్ వారితో సంప్రదించి వాటిని సరిచేయించాలని అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రికల్ పోల్ కు ఉన్న సపోర్ట్ పోల్ పాడైనందున వెంటనే దాన్ని మార్పించాలని కార్యనిర్వాహక ఇంజనీర్(ఎలక్ట్రికల్) విభాగం వారిని ఆదేశించారు. భూగర్భ డ్రైనేజి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వాటిని వెంటనే సరిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మురికి కాలవలలో మంచినీటి పైపులైన్లు ఉండటం గమనించి వెంటనే వాటిని మార్పించాలని అధికారులను ఆదేశించారు. వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని కాలువలు, రోడ్డులు శుభ్రం చేయాలని, నీటి నిల్వలు లేకుండా చూడాలని శానిటరి అధికారులను ఆదేశించారు. 
స్థానిక ప్రజలతో మాట్లాడుతూ, సీజనల్ వ్యాదులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ఇళ్ళలోని ఫ్రిజ్ వెనుక భాగంలో నీటిని, కుండీలలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించాలని సూచించారు. డోర్ టు డోర్ చెత్త తీసుకొనుటకు పారిశుధ్య సిబ్బంది సరిగా రాలేదని, వీధి దీపాలు సరిగా వెలగలేదని, మంచినీటి కొళాయిలు ఫోర్స్ గా రావడం లేదని స్థానిక ప్రజలు మేయర్, కమిషనర్ కు తెలియపరచగా,  వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం సోషల్ క్లబ్ శ్రీరామ గ్రంధాలయం శిధిలావస్థలో ఉండడంతో దాని స్థానంలో నూతనంగా భవనం నిర్మించాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ గేదల లావణ్య స్థానిక సమస్యలపై మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకురాగా  వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
ఈ పర్యటనలో 17వ వార్డు కార్పొరేటర్ గేదల లావణ్య, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, మూడవ జోనల్ కమిషనర్ కె. శివ ప్రసాద్, కార్యనిర్వాహక ఇంజినీరు(మెకానికల్) చిరంజీవి, కార్యనిర్వాహక ఇంజినీరు(వర్క్స్) శ్రీనివాస్, కార్యనిర్వాహక ఇంజినీరు(స్మార్ట్ సిటీ) సుధాకర్, ఎసిపి భాస్కర బాబు, ఎఎంఒహెచ్ రమణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.