సమగ్ర భూ సర్వేకి రైతులు సహకరించాలి..


Ens Balu
3
Duggirala
2021-06-28 13:40:55

రాష్ట్రంలోని భూ సమస్యలు, భూ తగాదాల పరిష్కారం కోసం సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పధకం  ద్వారా చేపట్టిన భూముల రీ సర్వే కార్యక్రమంను విజయవంతం చేసేందుకు రైతులందరూ  సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు.  సోమవారం దుగ్గిరాల మండలం దేవరపల్లి అగ్రహారంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం ద్వారా గ్రామం హాద్దు రాళ్ళ ఏర్పాటు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత తో కలసి పాల్గొన్నారు.  దేవరపల్లి అగ్రహారం గ్రామ శివారు పొలాల్లో గ్రామ హద్దు రాయి ఏర్పాటుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషా రాణి , ల్యాండ్ రికార్డ్స్, సర్వే సెటిల్మెంటు కమీషనర్ సిద్ధార్ధ జైన్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.  సంబంధిత పొలాల రైతులతో కలసి   హద్దురాయిని సర్వే అధికారులు ఏర్పాటు చేసారు. అనంతరం  దేవరపల్లి అగ్రహారం లోని మండల పరిషత్ పాఠశాల ఆవరణలో సర్వేకి సంబంధించి వినియోగించే సాంకేతిక పరికరాల ప్రదర్శనను మంత్రులు పరిశీలించారు.  సర్వేలో వినియోగించే గొలుసు, క్రాస్ స్టాఫ్, యారోస్, టేపు, థియోడలైట్, ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ ( ఈటీఎస్), కంటిన్యూ ఆపరేటింగ్ సిస్టం ( కార్స్ ) పరికరాల పనితీరును సర్వేయర్లు మంత్రులకు  వివరించారు.   
  ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సభను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ జ్యోతి వెలిగించి ప్రారంభించి  మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్న మూడు సంవత్సరాల కాలంలో శాస్త్రీయ పరిజ్ఞానం, భూముల సర్వేపై సమగ్ర అవగాహన ఉన్న సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సర్వే ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో  రూ. వెయ్యి కోట్ల నిధులతో భూముల రీ సర్వేకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం, రోవర్స్ తో భూముల సర్వే చేయడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. దేశంలో బ్రిటిష్ కాలంలో వంద సంవత్సరాల క్రితం జరిగిన భూముల సర్వే వలన అనేక భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.  గ్రామాల్లో సెంటు భూమి కోసం ప్రాణాలు ఇచ్చిన రైతులు ఉన్నారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ఆఫ్ ఇండియా సౌజన్యంతో పూర్తి నిబద్ధత, సుశి క్షతమైన బృందంతో రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని, దీనిని రైతులు పూర్తిగా వినియోగించు కోవాలన్నారు.  దేవరపల్లి గ్రామంలో హద్దు రాయి ఏర్పాటు  చేస్తున్నప్పుడు రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారని, రీ సర్వే వలన వారి దీర్ఘకాలిక భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారన్నారు.  భూ  తగాదాల పరిష్కారం కోసం  వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం ద్వారా జరుగుతున్న భూ సర్వేకి రైతులు పూర్తిగా మద్దతు ఇవ్వాలన్నారు. ప్రజా సంకల్పం యాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే చిత్తశుద్దితో అమలు చేస్తున్నారన్నారు.  విద్య, వైద్య, ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఉహించిన దానికంటే మిన్నగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారన్నారు. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ  నివారణ చర్యలు తీసుకుంటున్నారన్నారు. అక్షరాస్యత పెంచేందుకు అమ్మ ఒడి కార్యక్రమం, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు.   ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వుంటే,  ఒకేసారి 14 మెడికల్ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి పనులు ప్రారంభించారన్నారు. పేదలందరికీ ఇళ్ళ పధకం ద్వారా నివాసయోగ్యమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఇంటి పట్టాలు పంపిణీ చేయడంతో పాటు, జగనన్న కాలనీ లను గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నారన్నారు.   రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇంటి పట్టాలు పంపిణీ చేసే సమయంలో రెవిన్యూ శాఖా మంత్రిగా నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి మరిన్ని మంచి  కార్యక్రమాలు ప్రజలకు, రైతులకు చేయడానికి మీ అందరి  చల్లని ఆశీస్సులు కావాలన్నారు.  
  రాష్ట్ర  హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ  దేశంలో ఎక్కడా లేని విధంగా భూ సమస్యల  శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రంలోని భూముల రీ సర్వేని వైఎస్సార్ జగనన్న  శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి  చేపట్టడం జరిగిందన్నారు. భూ వివాదాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఎక్కువగా వుంటున్నాయన్నారు.  దేవరపల్లి అగ్రహారంలో డిసెంబర్ 2020 లో భూ సర్వేని ప్రారంభించి గ్రామ హద్దు రాళ్ళు నేడు ఏర్పాటు చేసుకోవడం  జరిగిందన్నారు. గతంలో మండలానికి ఒక సర్వేయర్ మాత్రమే ఉండడంతో రైతులు పొలాలు  సర్వే కోసం నెలల తరబడి ఇబ్బందులు పడాల్సి ఉండేదన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి సచివాలయంలో సర్వేయర్ ను నియమించి, సర్వేని సులభతరం చేశారన్నారు.  సమగ్ర భూ సర్వేలో ప్రభుత్వమే పొలాలు సర్వే చేసి హద్దు రాళ్ళను సైతం ఏర్పాటు చేస్తుందన్నారు.  రానున్న మూడు సంవత్సరాలలో రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వేని పూర్తిచేసి భూ  సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.  గ్రామాల్లోని రైతులకు భవిష్యత్తులో భూ సమస్యలు లేకుండా రీ సర్వేని చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా  సమగ్ర  భూముల రీ సర్వే గొప్ప కార్యక్రమంను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారన్నారు.  దేశంలో 1930, 1950 లో భూముల సర్వే జరిగిందని, ఎంతో కష్టతరమైన సమగ్ర భూముల రీ సర్వేని ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. స్పందనలో 90 శాతం భూ సమస్యలే వస్తున్నాయని, రీ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయడం వలన  భూ తగాదాలు పూర్తిగా తగ్గి పోతాయన్నారు.  జిల్లా ఫైలేట్ ప్రాజెక్ట్ దేవరపల్లి అగ్రహారంలో భూ సర్వేని ప్రారంభించామని, నాలుగు రెవిన్యూ డివిజన్లలోను ఒక్కో గ్రామాన్ని ఫైలేట్ ప్రాజెక్ట్ గా తీసుకుని సమగ్ర సర్వే చేస్తున్నామన్నారు.  సర్వే పై నిష్ణాతులైన అధికారులు, సర్వేయర్ల ను వినియోగించుకుని  స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుల సమిష్టి  సహకారంతో నిర్దేశించిన సమయంలో రీ సర్వేని పూర్తి చేస్తామన్నారు.  
  సంయుక్త కలెక్టర్ ( రైతు  భరోసా, రెవిన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా  జిల్లాలో ఫైలేట్ ప్రాజెక్ట్ క్రింద దేవరపల్లి అగ్రహారంలో ప్రారంభించిన సమగ్ర భూముల రీ సర్వే కార్యక్రమం గ్రామస్తుల భాగస్వామ్యంతో ముమ్మరంగా కొనసాగుతున్నదన్నారు.  రీ సర్వేపై విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయర్లకు, విఆర్ ఓ లకు ఈటియస్, కార్స్ వినియోగంపై మూడు విడతల శిక్షణ ఇచ్చామన్నారు.  రీ సర్వేపై గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామస్తులకు పుర్తిస్తాయిలో అవగాహన కల్పించామన్నారు.  రీ సర్వేలో భాగంగా డ్రోన్ ద్వారా విలేజ్ హద్దులు డీ మార్కింగ్ చేసి ఆబాది, నాన్ ఆబాది ప్రాంతాలను మార్కింగ్ చేయడం  జరిగిందన్నారు.  ఆబాది ప్రాంతంలో ప్రభుత్వ భూములను సంబంధిత  శాఖల భాగస్వామ్యంతో మార్కింగ్  చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రైవేటు  స్థలాల సర్వే ప్రారంభిస్తున్నామన్నారు. రీ సర్వే  వలన రైతుల పొలాల నుండి సరుకులను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు వీలుగా రహదారిని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  దేవరపల్లి అగ్రహారం ను స్పూర్తిగా తీసుకుని అన్ని గ్రామాల్లోను పొలాల మధ్య రహదారులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  
  మంగళగిరి శాసన సభ్యులు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, తెనాలి శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా, రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్రంలోని భూములు రీ సర్వే చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు.  రాష్ట్రంలో భూ వివాదాలు, సమస్యలు లేకుండా భూముల అమ్మకం, కొనుగోలుకు  ఇబ్బంది వుండకూడదని రూ. వెయ్యి కోట్లతో భూముల రీ సర్వేని చేపట్డడం జరిగిందన్నారు.  భూ సర్వే సందర్భంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక న్యాయస్థానం సైతం ఏర్పాటు చేసి పరిష్కరించనున్నారన్నారు.  రాష్ట్రంలో భూ సర్వే కార్యక్రమంలో చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచి పోతుందన్నారు.  గ్రామాల నుండి దేశాల వరకు భూ సరిహద్దుల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. రైతుల దీర్ఘకాలిక భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న రీ సర్వేని  రైతులు విజయవంతం చేయాలన్నారు. 
  సభలో గ్రామ రైతులు మాట్లాడుతూ రీ సర్వే ద్వారా పంట పొలాల నుండి సరుకులను మార్కెట్ కు తీసుకువెళ్లేందుకు రహదారి  ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సర్వే పూర్తి అయితే ఒకే ప్రాంతంలో ఐదారు సర్వే నెంబర్లలో ఉన్న ఒకే రైతు భూములకు ఒకే సర్వే నెంబర్ కేటాయించడం రైతులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. రీ సర్వేకు రైతులు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామన్నారు. 
  సభ అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సచివాలయాలలోని భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా సమగ్ర భూ రీ సర్వే ద్వారా భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం జరుగుతుందన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో రైతులు, ప్రజలు భూ సమస్యలు, తగాదాలు పరిష్కరించాలని విన్నపాలు చేయడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షా పధకం  ద్వారా రాష్ట్రంలోని భూముల రీ సర్వేకి శ్రీకారం చుట్టారన్నారు.  రాష్ట్రంలోని భూములన్ని మూడు విడతలలో రీ సర్వే చేసి భూ యజమానులకు శాశ్వత భూ హక్కు కల్పించనున్నారన్నారు.  భూములకు సంబంధించి గతంలో జరిగిన పొరపాట్లను  శాస్త్రీయంగా, సాంకేతికంగా సర్వే ఆఫ్ ఇండియా సౌజన్యంతో భూముల రీ సర్వేని ప్రభుత్వ చేస్తుందన్నారు.  రైతులు భూ సర్వేపై అపోహలు పడకుండా రీ సర్వేకి సహకరించాలన్నారు.  సర్వే  పూర్తి అయినా, సమస్యలు ఏమైనా వుంటే ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి  పరిష్కరించడం జరుగుతుందన్నారు. అన్ని రెవిన్యూ డివిజన్లలో , మండలాల్లో, గ్రామాల్లో భూ సర్వే పూర్తి అయితే రైతులకు, ప్రజలకు  ప్రయోజనం చేకూరుతుందన్నారు. 
  సభ అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రెవిన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
  ఈ కార్యక్రమంలో సర్వే శాఖ  అసిస్టెంట్ డైరెక్టర్ చలపతిరావు,  ఇన్ చార్జ్ తెనాలి ఆర్ డి ఓ భాస్కర రెడ్డి,  తహసీల్దార్ మల్లేశ్వరి, యంపీడీఓ కుసుమ కుమారి,  గ్రామసర్పంచ్ కుషిభాయ్,  సర్వే ఇన్స్పెక్టర్స్ వై. రామకృష్ణ రెడ్డి, నాయక్, మండల సర్వేయర్లు, విలేజ్ సర్వేయర్లు, రెవిన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.