హౌసింగ్ గ్రౌండింగ్ పక్కాగా జరగాలి..


Ens Balu
4
Anantapur
2021-06-28 14:21:40

రాష్ట్ర ప్రభుత్వం జూలై 1, 3, 4 వ తేదీల్లో పెద్ద ఎత్తున చేపట్టనున్న ఇళ్ల గ్రౌండింగ్ కు అన్ని విధాలా పక్కాగా సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ లోని విసి హాల్ నుంచి ఇళ్ల గ్రౌండింగ్, కోవిడ్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, అంగన్వాడీ కేంద్రాల భవనాలు తదితర అంశాలపై మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్ లు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, తదితరులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు నిశాంత్ కుమార్, ఏ.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్య తేజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇళ్ల గ్రౌండింగ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, జిల్లాలో 30 వేల ఇళ్ల గ్రౌండింగ్ చేపట్టాలని లక్ష్యం కేటాయించగా, జూలై 1, 3, 4 వ తేదీల్లో ప్రతిరోజు 10 వేలు చొప్పున ఇళ్లను గ్రౌండింగ్ చేయాలన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లా, మండల, సచివాలయ స్థాయిలో ప్రతి ఒక్క అధికారికి ఇళ్ల గ్రౌండింగ్ పై పూర్తి అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ ఏమేం చేయాలి అనే దానిపై పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ పై ఎంపిడివోలు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లకు ఓరియంటేషన్ ఇచ్చామని, మండల స్పెషల్ ఆఫీసర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మంగళవారం  లబ్ధిదారులకు ఇళ్ల గ్రౌండింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎక్కువగా ఆప్షన్ 1, 2 కింద ఇళ్లు గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు. ఇలా గ్రౌండింగ్ లో ఆరోగ్య, వ్యవసాయ సిబ్బంది మినహా ఇతర అన్ని శాఖల అధికారులు ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులను, ఎన్జీవోలను భాగస్వామ్యం చేసి ఇళ్ల గ్రౌండింగ్ ని విజయవంతం చేయాలన్నారు.

ఇళ్ల గ్రౌండింగ్ రోజు సంబంధిత లబ్ధిదారులు ఖచ్చితంగా వచ్చేలా చూడాలని, ఇంటి స్థలంలో మార్కింగ్ ఇవ్వాలని, ఎర్త్ వర్క్ వరకు పనులు జరగాలని, ఇందుకోసం అవసరమైన ఇసుక, సిమెంట్ సిద్ధంగా ఉంచాలన్నారు. ఇళ్ల గ్రౌండింగ్ కోసం అవసరమైన పనిముట్లు, ఇతర వసతులు అన్ని కల్పించాలన్నారు. వాలంటీర్లకు లబ్ధిదారులను జతచేసి వారు స్థలం వద్దకు వచ్చేలా చూడాలని, ఇళ్ల గ్రౌండింగ్ అయ్యాక ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గ్రౌండింగ్ కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందించేలా చూడాలని, లబ్ధిదారులను లేఔట్ వద్దకు తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని లేఅవుట్లలో నీటి వసతి, విద్యుత్ సరఫరా పూర్తి కాలేదని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రెండు రోజుల్లో పనులు పూర్తి చేయాలన్నారు. ఆయా మండలాల వారు వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు కట్టుదిట్టంగా, సీరియస్ గా పని చేయాలన్నారు. ముందుగానే ఏ రోజు ఏ లబ్ధిదారులు గ్రౌండింగ్ చేస్తారు అనేది జాబితా సిద్ధం చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా సక్రమంగా ప్రణాళిక వేసుకొని అవగాహన కల్పించి ఇలా గ్రౌండింగ్ జరిగేలా చూడాలన్నారు.

కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గినా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఐఈసి యాక్టివిటీ లను ఖచ్చితంగా పాటించాలన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ, నోమాస్క్ నో సేల్, నో మాస్క్ నో రైడ్ ని అమలు చేయాలన్నారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడం, కాంటాక్ట్ ట్రెసింగ్ చేయడం, శాంపిల్స్ సేకరించడం చేయాలన్నారు. అలాగే గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణంలో వేగం పెంచాలన్నారు. ఆయా భవన నిర్మాణాల్లో పురోగతి చూపించాలని, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయా భవనాల నిర్మాణంలో వెనుకబడిన మండలాల్లో వేగవంతంగా చేపట్టాలని, జూలై నెలాఖరు లోపు ఆయా భవన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. భూమి రికార్డుల స్వచ్చికరణకు సంబంధించి జిల్లాలోని ఐదు పైలెట్ గ్రామాల్లో రెండు రోజుల లోపు పరిశీలన (గ్రౌండ్ టు థింగ్) పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలంలోనూ ఒక గ్రామంలో రీ సర్వే యాక్టివిటీ వెంటనే మొదలుపెట్టాలన్నారు. ఇందుకు సంబంధించి ఆర్డీవోలు, తహశీల్దార్లు రీ సర్వే పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ఈ సందర్భంగా హౌసింగ్ జాయింట్ కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ ఇళ్ల గ్రౌండింగ్ కు సంబంధించి జూలై 1,3, 4 వ తేదీన ఎవరెవరు లబ్ధిదారులు గ్రౌండింగ్ చేస్తారు అనేదానిపై జాబితా ముందుగానే సిద్ధం చేయాలన్నారు. పెద్దఎత్తున ఇళ్ల గ్రౌండింగ్ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే మార్కింగ్ ఇవ్వాలన్నారు. మండలాల వారీగా వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్ఓ గాయత్రీదేవి, హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు, జిల్లా పరిషత్ సీఈవో భాస్కర్ రెడ్డి, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, మెప్మా పిడి రమణారెడ్డి, అడిషనల్ డిఎంహెచ్ఓ రామసుబ్బయ్య, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, డిసిహెచ్ఎస్ రమేష్ నాథ్, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి కృపాకర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.