మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా 40 వేల సూచనాత్మక లక్ష్యానికి మించి నిర్మాణాలు ప్రారంభయ్యేలా చూడాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్ నుంచి ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా ద్వారా పెద్దఎత్తున జరగనున్న శంకుస్థాపనలకు సంబంధించి సన్నద్ధత కార్యాచరణపై జేసీ (ఆర్) డా. జి.లక్ష్మీశ, జేసీ (డీ) కీర్తి చేకూరి, జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి, జేసీ (హెచ్) ఎ.భార్గవ్ తేజలతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం యూనిట్‌కు ఇచ్చే 1,80,000కు అదనంగా లబ్ధిదారులకు ఎస్‌హెచ్‌జీ లింకేజీ ద్వారా ప్రాథమికంగా రూ.50 వేల అడ్వాన్సు రుణాలు కూడా అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.40 కోట్లు అందించామని, మరో రూ.200 కోట్లను అందించేందుకు డీఆర్‌డీఏ, మెప్మా విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వసతులతో పాటు మెటీరియల్, ఆర్థిక సహకారం తదితర అంశాలపై గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారులకు అవగాహన కల్పించి, ఇళ్ల నిర్మాణాలకు ముందుకొచ్చేలా ప్రోత్సహించాలని... ఈ మేరకు వాలంటీర్లకు మార్గనిర్దేశనం చేయాలని సూచించారు. సెప్టెంబర్‌లో వైఎస్సార్ ఆసరా ద్వారా జిల్లాలోని మహిళలకు దాదాపు రూ.1200 కోట్లు మొత్తం కూడా అందుబాటులోకి రానుందని వెల్లడించారు. మేళాను విజయవంతం చేసేందుకు వీలుగా వాలంటీర్, లబ్ధిదారుల ట్యాగింగ్; ప్లాట్ల మార్కింగ్, లేఅవుట్‌లో నిర్మాణ సామగ్రి నిల్వ, నీటి సరఫరా తదితరాలకు సంబంధించిన పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. మండలస్థాయి అధికారులకు సహాయంగా ఉండేందుకు లేఅవుట్‌ల వారీగా ఏర్పాటుచేసిన నోడల్ బృందాలకు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు సూచనలు, సలహాలు అందించేందుకు జిల్లస్థాయి కంట్రోల్‌రూంలో విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, మైనింగ్, పంచాయతీరాజ్ వంటి సమన్వయ శాఖల సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ల క్రియాశీల భాగస్వామ్యంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మండలాల వారీగా ప్రణాళికలు రూపొందించి, ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గ్రౌండింగ్ యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఇళ్ల నిర్మాణాల మెగా గ్రౌండింగ్ మేళా సందర్భంగా లేఅవుట్లలో కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా చూడాలని, ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మెగా గ్రౌండింగ్ సందర్భంగా రోజువారీ లక్ష్యాలను సాధించడంలో పురోగతిపై మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. సమావేశంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా, రంపచోడవరం సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వర్‌నాయక్, హౌసింగ్ పీడీ జి.వీరేశ్వరప్రసాద్, జిల్లా, డివిజనల్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.