పేదల సొంతింటి కలను సాకారం చేయాలి..


Ens Balu
4
Guntur
2021-06-28 15:05:59

పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు మెగా హౌసింగ్ గ్రౌన్దింగ్ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు.    సోమవారం మధ్యాహ్నం  సత్తెనపల్లి పట్టణంలోని వెంకటేశ్వర గ్రాండ్ కళ్యాణ మండపంలో  నవరత్నాలు   పేదలందరికీ ఇళ్ళు మెగా హౌసింగ్ గ్రౌన్దింగ్ సమీక్షా సమావేశ కార్యక్రమం జరిగింది.  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు, సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి,  గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణు గోపాలరావు లు పాల్గొన్నారు.  సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల మందికి ఇంటి పట్టాలను  మంజూరు చేసిందన్నారు.  ఇది చారిత్రాత్మకమైన గొప్ప కార్యక్రమమని జిల్లా కలెక్టర్ కొనియాడారు. మహిళల పేరుతొ పట్టాలు అందించడం ద్వారా వారికి ఆస్తి హక్కును కల్పించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. జూలై 1, 3 మరియు 4 వ తేదీ లలో మెగా హౌసింగ్  గ్రౌన్దింగ్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 30 జగనన్న కాలనీ లే అవుట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  మొత్తం 5270 మంది లబ్దిదారులకు  గృహాలను  నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు  తెలిపారు. ఇందులో 4683 మందికి ఇళ్ళ స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు.   587  మందికి స్వంత   ఇళ్ళ స్థలాలు ఉన్న వారికి గృహ నిర్మాణాలను చేపట్టేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు.  ఇప్పటికే 764 మంది గృహాలకు గ్రౌన్దింగ్ కార్యక్రమం పూర్తి అయినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.  4506 మంది లబ్దిదారులకు మెగా గృహ నిర్మాణ  గ్రౌన్దింగ్  కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ల్యాండ్ లేవలింగ్ పనులు  మహాత్మా గాంధీ  జాతీయ గ్రామీణ ఉపాధి హామి  పధకం  ద్వారా చేపడుతున్నట్లు వెల్లడించారు.  లబ్దిదారులకు ఇప్పటికే ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించేలా చర్యలు తీసుకుందన్నారు.  గృహ నిర్మాణాలకు కావలసిన నిర్మాణ సామాగ్రి ఇనుము, ఇటుక, సిమెంట్ వంటి వాటిని తక్కువ ధరకు ప్రభుత్వమే అందిస్తుందన్నారు.  గృహ నిర్మాణాలకు సంబంధించి మేస్త్రీ లను ముందుగానే క్రోడీకరించుకుని, వారికి  తగిన శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  గృహ నిర్మాణాల ప్రారంభ దశ మొదలుకొని పూర్తి అయ్యే నాటికి దశల వారీగా బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఇళ్ళ నిర్మాణాల సమయంలో లబ్దిదారులకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్త్రీ శక్తి బ్యాంకు ద్వారా డ్వాక్రా  గ్రూపులలో సభ్యులుగా ఉన్న మహిళా లబ్దిదారులకు ఋణాలు ఇప్పించే  ప్రక్రియను  చేపట్టాలని ఆదేశించారు.

 

          నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ లబ్దిదారులకు ఇళ్ళు కట్టించి గృహ ప్రవేశాలు చేయించినప్పుడే లక్ష్యం  సాధించినట్లు అవుతుందని అన్నారు.  స్థానిక సర్పంచ్ లు, వార్డు కౌన్సిలర్లను అధికారులు సమన్వయం  పరచుకుని   నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.  ఏ కార్యక్రమంలోనైనా ప్రారంభ దశలో సమస్యలు రావడం సహజమని, వాటిని అధిగమిస్తూ లక్ష్యాన్ని సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. 

 

          సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పేదలందరికీ పధకంలో లబ్దిదారులకు స్థలాలను ఇవ్వడమే కాకుండా గృహాలను నిర్మించి  అందిస్తున్నారని కొనియాడారు.  లబ్దిదారులు గృహ ప్రవేశం చేసే దాకా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.   రాష్ట్రంలోనే  సత్తెనపల్లి నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు గృహ నిర్మాణాల కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. 

           సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సత్తెనపల్లి నియోజకవర్గానికి నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకం  ద్వారా లబ్దిదారులకు కేటాయించిన ఇంటి స్థలాలు, గృహ నిర్మాణాలకు సంబంధించి ఏర్పాటు చేసిన మౌళిక వసతుల వివరాలను తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు మెగా గృహ నిర్మాణ గ్రౌన్దింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు  కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

 

          సమావేశంలో సత్తెనపల్లి పట్టణ మున్సిపల్  కౌన్సిలర్లు, నియోజకవర్గ గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ లు, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస రావు, తహశీల్దార్ రమణ కుమారి, యంపీడీఓ సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పార్ధసారధి,  గృహ శాఖ, విద్యుత్, నీటి పారుదల, ఏ.పీ ఫైబర్  శాఖల అధికారులు పాల్గొన్నారు.