ప్రణాళిబద్దంగా విశాఖ అభివ్రుద్ధి..


Ens Balu
3
Visakhapatnam
2021-06-29 12:32:55

 కార్యనిర్వాహక రాజధానిగా మారబోతున్న విశాఖ నగరాన్ని ప్రణాళికాయుతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  మంగళవారం కలెక్టరు కార్యాలయంలో ఎం.పి. విజయసాయిరెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. విశాఖను మురికి వాడల రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు, అదే క్రమంలో పేదలందరికీ స్వంత ఇల్లు చేకూర్చనున్నట్లు తెలిపారు.  నెల రోజులలో నగరంలో గల మురికి వాడల పరిధి,  అక్కడ నివశిస్తున్న ప్రజల వివరాలు  అధికారులు సేకరిస్తారని, దాని ప్రకారం మెట్రో నగర స్వరూపంలో  అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామన్నారు.  నగరాన్ని కాలుష్య రహిత నగరంగా, పూర్వపు ఉష్టోగ్రతల మాదిరిగా ఆహ్లాదంగా వుండేందుకు  హరిత విశాఖగా మార్చేందుకు  లక్ష మొక్కలను నాటేందుకు సంకల్పించామన్నారు.  నగరంలో గుర్తించిన ఖాళీ స్థలాల్లో పార్కులను, వాకింగ్ ట్రాక్ లను రూపొందించ నున్నట్లు వెల్లడించారు.  ఈ కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.  ఇప్పటికే ఎన్.ఏ.డి. ఫ్లైవోవర్ పూర్తి కావస్తోందని,  నగరం నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్ కనెక్టివిటీ కల్పించేందుకు  జాతీయ రహదారికి సమాంతరంగా  విశాఖ–భీమిలి-భోగాపురం బీచ్ కారిడార్ రూపొందిస్తున్నట్టు చెప్పారు.  

రాజ్య సభ సభ్యులు వి.విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ సింహాచలం పంచగ్రామాల సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటువన్నామన్నారు. ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి వున్నామని తెలిపారు. విజయనగరం, విశాఖపట్నం జాయింట్ కలెక్టర్లతో నిష్పక్షపాతంగా సర్వే చేయిస్తామన్నారు. వారు భూములను పరిశీలించి నివేదిక సమర్పిస్పారని చెప్పారు. 
 దేవాలయ భూముల ఆక్రమణలు, బదిలీలు, అమ్మకాలపై  ఎస్టేట్ అబాలిషన్ చట్టం,  ల్యాండ్ సెటిల్ మెంట్ చట్టం, అనామలీస్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.  ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడం, ఆక్రమించడంలో కారకులైన వారిపైన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవన్నారు.  సింహాచలం  దేవస్థాన భూముల విషయంలో ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూముల సమస్యను కోర్టు ఆదేశాల మేరకు రెగ్యులర్ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో విశాఖ నగర మేయరు జి.వి.హరి కుమారి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్ పాల్గొన్నారు.  అంతకు ముందు పర్యాటక శాఖా మంత్రి  ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం పి వి.విజయసాయిరెడ్డి కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు, జి.వి.ఎం సి కమీషనరు, జాయింట్ కలెక్టర్లు ఇతర రెవెన్యూ జి.వి.ఎం.సి. అధికారులతో విశాఖా నగర అభివృద్థి, భూ సంబంధిత విషయాలను గురించి  సమీక్షించారు.