మెగాగృహ నిర్మాణాలకు సిద్ధంకావాలి..


Ens Balu
4
Srikakulam
2021-06-29 12:36:58

శ్రీకాకుళం జిల్లాలో జూలై 1, 3,4 తేదీల్లో జరిగే మెగా గృహ నిర్మాణాల శంఖుస్ధాపనకు సిద్ధం కావాలని మండల అధికారులను గృహ నిర్మాణం జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ పిలుపునిచ్చారు. మంగళ వారం కలెక్టర్ కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులు, మండల స్ధాయి అధికారులతో మెగా హౌసింగ్ డ్రైవ్ పై వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. నిర్ధేశించిన మూడు రోజుల్లో అత్యధిక సంఖ్యలో శంఖుస్ధాపన కార్యక్రమాలు చేపట్టి గృహ నిర్మాణాలు ప్రారంభించాలని ఆదేశించారు. కొద్ది రోజుల్లో ఆషాడమాసం వస్తుందని ఆ నెలలో నిర్మాణాలు ప్రారంభించుటకు ముందుకు రావడంలో సంశయం ప్రదర్శించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నెల రోజుల పాటు పనులు ప్రారంభం కాకపోవడం వలన జిల్లా ప్రగతి బాగా తగ్గుతుందని, పేదల ఇళ్ళ నిర్మాణం వెనుకబడిపోతుందని ఆయన చెప్పారు. త్వరగా గృహ నిర్మాణాలు ప్రారంభించడం వలన నిర్మాణాలు త్వరగా పూర్తి అవుతాయని కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేయవచ్చని ఆయన సూచించారు. జిల్లాలో దాదాపు 51 వేల మంది సొంత ఇళ్ళ పట్టాలు కలిగిన వారు ఉన్నారని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు సామగ్రిని అందజేయడంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జెసి అన్నారు. జిల్లాలో ప్రతి లే అవుట్ లో ఇళ్ళ నిర్మాణాలకు సమస్య తలెత్తకుండా నీటి సౌకర్యం కల్పించాలని ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. బోర్లు లేనప్పుడు కనీసం రవాణా ద్వారా నీటి సరఫరాను కల్పించాలని ఆయన స్పష్టం చేసారు. బుధ వారం నాటికి ఇంజనీరింగు సహాయకులు మార్కింగు చేయాలని, ఎక్కువ మంది మేస్త్రీలను సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు. మూడు రోజులు లబ్దిదారులను తమ స్ధలాల వద్దుకు తీసుకు వచ్చే బాధ్యతను వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించిందని, వాలంటీర్ల యాప్ లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. శంఖుస్ధాపన చేసిన ఫోటో, జియో ట్యాగింగు చేసిన ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని ఆయన సూచించారు. మండలాల్లో ఇళ్ళ నిర్మాణ పనులు త్వరితగతిన జరిగే బాధ్యత మండల ప్రత్యేక అధికారులదేనని ఆయన స్పష్టం చేసారు. మండల స్ధాయి అధికారుల భాగస్వామ్యంతో ప్రత్యేక అధికారులు ప్రగతి పథంలో నడిపించాలని హిమాంశు పేర్కొన్నారు. ఇళ్ల శంఖు స్ధాపన కార్యక్రమం వేగవంతంగా జరుగుటకు అన్ని స్ధాయిల ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అవసరమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో లబ్దిదారులు నిర్మాణాలకు త్వరగా ముందుకు వచ్చి పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. జిల్లాలో 14 పెద్ద లే అవుట్ లకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.

      ఈ వీడియో కాన్ఫరెన్సులో గృహ నిర్మాణ సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ టి.వేణుగోపాల్, ఇపిడిసిఎల్ పర్యవేక్షక ఇంజనీరు ఎల్.మహేంద్రనాథ్, మండల ప్రత్యేక అధికారులు - జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మిపతి, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, బి.సి కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు జి.రాజారావు, ఎస్.డి.సి పి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.