కొండవాలు కాలువల్లో చెత్తలు వేయొద్దు..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-06-29 12:42:32

కొండవాలు ప్రాంత ప్రజలు వ్యర్ధాలను కాలువలలో వేయకూడదని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మంగళవారం ఆమె నాలుగవ జోన్ 36వ వార్డు రంగిరిజు వీధి, బాబా కొండ తదితర ప్రాంతాలలో  కమిషనర్ డా. జి. సృజనతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండ ఎగువ భాగంలో ఉన్న వారు కాలువలలో చెత్త  వేయడం వలన దిగువ భాగంలో చెత్త పూడిక పోయి కాలువలు పొంగి మురుగు బయటకు వచ్చేస్తుందన్నారు. కాలువలలో చెత్త తొలగించక పోవడంతో మురుగు నీరు సరిగా ప్రవహించలేదని దీనిని వెంటనే తొలగించాలని శానిటరీ అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజిలో పూడిక పేరుకు పోయి యు.జి.డి. నాళాలు వద్ద మురుగు నీరు బయటకు వస్తుందని, నాళాలు లోని చెత్తను తొలగించాలన్నారు. మురుగు నీరు సాఫీగా పోయే విధంగా చూడాలని, భూగర్భ డ్రైనేజి కనక్షన్ కోసం  తీసిన గొయ్యలు సరిగా పూడ్చక పోవడం వలన రాళ్ళు, మట్టి పైకి తేలి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందన్నారు. వెంటనే ఆ రోడ్డు బాగు చేయాలని సహాయక ఇంజినీరును ఆదేశించారు. కొండపైన ఉన్న సులాభ్ కాంప్లెక్స్ వినియోగంలో లేనందున దానిని కమ్యునిటీ హాలుగా మార్చాలని, పోలమాంబ గుడివద్ద నూతనంగా ఒక కమ్యునిటీ హాలు నిర్మించుటకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. 

రంగిరిజు వీధిలో మధ్యలో పెద్ద చెట్టు ఉండడంవలన పాములు అధికంగా వస్తున్నాయని, ఆ చెట్టును తొలగించాలని స్థానికలు తెలియపరచగా చెట్టు కొమ్మలను తొలగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వార్డులో చెత్త సేకరణకు సరిపడే పారిశుధ్య సిబ్బంది ఉన్నారని, ప్రతి రోజు డోర్ టు డోర్ చెత్త సేకరించాలని, తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తగా విభజించిన చెత్తను తీసుకోవాలని, చెత్త నిర్వహణ ప్రక్రియపై మహిళా సంఘాలు, వార్డు సచివాలయ కార్యదర్శుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ వార్డులో ఉన్న కొన్ని సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వారు స్పందించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, నాలుగవ జోనల్ కమిషనర్ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీరు శివప్రసాద రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు చిరంజీవి, శ్రీనివాస్, గణేష్ కుమార్, వెటర్నరి డాక్టరు కిషోర్, ఎసిపి అమ్మోజి, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు సత్యనారాయణ, సహాయక ఇంజినీరు తదితర అధికారులు పాల్గొన్నారు.