స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు చేయాలి..
Ens Balu
3
Kakinada
2021-06-29 12:46:18
లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం (పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్) పటిష్టంగా అమలయ్యేలా చూడాలని, స్కానింగ్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీల సంఖ్యను పెంచాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి జిల్లా, డివిజనల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ-డీఎల్ఎంఎంఏఏ (పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్) సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది. తొలుత సమావేశ అజెండా అంశాలను డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వరరావు వివరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 317 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటిలో 35 ప్రభుత్వం పరిధిలో ఉండగా, 282 ప్రైవేటు కేంద్రాలని వెల్లడించారు. జిల్లాలో స్కానింగ్ కేంద్రాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరక్కూడదని స్పష్టం చేశారు. కలెక్టర్ నేతృత్వంలో చట్టం అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. 2021, జనవరి నుంచి జూన్ వరకు డివిజనల్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, ఆర్‌డీవోలు 201 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారని.. డివిజనల్ స్థాయిలో షెడ్యూల్ ప్రకారం ఆకస్మిక తనిఖీలు జరిగేలా చూడాలని, అందుబాటులో ఉన్న 16 మంది ప్రోగ్రామ్ అధికారులు క్రియాశీలంగా వ్యవహరిస్తూ తనిఖీలు చేపట్టాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులను కూడా భాగస్వాములను చేయాలన్నారు. 2021, జనవరి నుంచి జూన్ వరకు డివిజనల్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు 18 డెకాయ్ ఆపరేషన్లు చేపట్టారని.. అయితే ఈ సంఖ్యను బాగా పెంచాలని ఆదేశించారు. జిల్లాలో కొత్తగా స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్‌కు 13, రెన్యువల్ కోసం 57 దరఖాస్తులు రాగా, పూర్తిస్థాయి తనిఖీల అనంతరం వాటికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. చట్టం అమలుకు సంబంధించి ఫిర్యాదులు తెలియజేసేందుకు జిల్లాస్థాయిలో 1800-425-3365 టోల్‌ఫ్రీ నెంబరు అందుబాటులో ఉందని జేసీ (డీ) కీర్తి చేకూరి వివరించారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఇలాక్కియా, 4వ అడిషనల్ జడ్జ్ ఎన్.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్‌పీ కరణం కుమార్, డీసీహెచ్ఎస్ డా. టి.రమేష్ కిశోర్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయకర్త పి.రాధాకృష్ణ, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, ఛేంజెస్ ఎన్‌జీవో ప్రతినిధి కె.వెంకటేశ్వరరావు, జిల్లా, డివిజనల్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.