భారీగా పెరిగిన కార్మికుల వేతనాలు..
Ens Balu
4
Vizianagaram
2021-06-29 12:48:45
కనీస వేతనాలు భారీగా పెరిగాయి. సాధారణ కార్మికులతోపాటు, నైపుణ్యం గల కార్మికుల వేతనాలను గణనీయంగా పెంచుతూ, కనీస వేతన కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ అధ్యక్షతన కలెక్టర్ క్యాంపు ఆఫీసులో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. వివిధ శాఖల అధికారులతో ముందుగా కలెక్టర్ చర్చించారు. గత ఏడాది ధరలను పరిశీలించిన అనంతరం, కొత్త ధరలను ఖరారు చేశారు. అన్ స్కిల్డ్ లేబర్‌కు కనీస వేతనాన్ని గ్రామీణ ప్రాంతంలో రూ.350, పట్టణ ప్రాంతంలో రూ.375 గా నిర్ణయించారు. గతంలో ఈ వేతనం గ్రామాల్లో రూ. 315, పట్టణంలో రూ.335గా ఉండేది. సెమీ స్కిల్డ్ వేతనాలు గ్రామీణ ప్రాంతంలో రూ.390 నుంచి రూ.435కు, పట్టణ ప్రాంతంలో రూ.410 నుంచి రూ.450కి పెంచారు. స్కిల్డ్ లేబర్ వేతనాలను గ్రామీణ ప్రాంతంలో రూ.475 నుంచి రూ.525, పట్టణ ప్రాంతంలో రూ.500 నుంచి రూ.550కు హెచ్చించారు. హైలీ స్కిల్డ్ లేబర్‌కు గ్రామీణ ప్రాంతంలో రూ.625 నుంచి రూ.675కు, పట్టణ ప్రాంతంలో రూ.630 నుంచి రూ.680కి పెంచుతూ కొత్త వేతనాలను ఖరారు చేశారు. ఈ వేతనాలు 2021 జులై 1 నుంచి 2022 జూన్ 30 వరకూ అమల్లో ఉంటాయి. ఈ సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి జె.విజయలక్ష్మి, డిప్యుటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సిహెచ్ పురుషోత్తం, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, పరిశ్రమలశాఖ జిఎం ప్రసాదరావు, రెవెన్యూ, ఆర్అండ్‌బి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.