కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో, న్యాయ మంత్రిత్వశాఖ ఇటీవల రూపొందించిన న్యాయబంధు యాప్ (ఆప్) అందరికీ బంధువు లాంటిదని, జిల్లా న్యాయసేవల అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వి.లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన బ్లూజీన్స్ వర్చువల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ యాప్ గురించి న్యాయ సేవాధికార సంస్థలోని ప్యానల్ న్యాయవాదులకు వివరించారు. పేదలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డ్ తెగల వారు, మహిళలు, పిల్లలు, వరదలు, తుఫాన్లు, అగ్నిప్రమాద బాధితులు, అత్యాచార బాధితులు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఈ యాప్ ద్వారా ఉచితంగా న్యాయ సేవలను పొందవచ్చని సూచించారు. కరోనా సమయంలో ఈ యాప్‌ద్వారానే ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు మరింత చేరువ అయ్యాయని తెలిపారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మొబైల్ ఫోన్‌లోకి ఈ యాప్‌ను ప్రతీఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని, దీనిపై ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేయాలని సూచించారు. జులై 10న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు వినియోగించుకోవాలని సూచించారు. దీనికి ముందస్తుగా జులై 1 నుంచి జరిగే లోక్ అదాలత్‌లను కూడా వినియోగించుకోవాలని, దీనికి ప్యానల్ న్యాయవాదులు తమ పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.