ఆ ఇద్దరు శానిటరీ ఇనెస్పెక్టర్లని సస్పెండ్ చేయండి..


Ens Balu
3
ఉడా చిల్డ్రన్స్ థియేటర్
2020-09-02 20:25:39

జీవిఎంసీ పరిధిలో ప్రతీ ఇంటినుండి విభజన చేసిన చెత్తనే విధిగా సేకరించాలని, చెత్తను వేరు చేసి ఇవ్వని ఇంటినుండి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించ రాదని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన సూచించారు. బుధవారం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నగరంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనితీరుపై కమీషనర్ సమీక్షా నిర్వహించారు. నగరంలో ప్రతీ ఇంటి నుండి చెత్త సేకరణ ఆన్ లైన్ వేస్ట్ మేనేజ్మెంటు వ్యవస్థ ద్వారా జరుగుతున్న పనితీరుపై కమీషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై సమీక్షించిన కమీషనర్ 10 మంది శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు బాగులేదని అందులో ఇద్దరు  శానిటరీ ఇన్స్పెక్టర్ల పనితీరు నిర్లక్ష్యంగా ఉందని, వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు సిద్ధం చేయవలసినదిగా అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావును కమీషనర్ ఆదేశించారు. మిగిలిన 8 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు వచ్చే వారం జరుగబోయే సమీక్షకు వారి పనితీరును మెరుగుపరచుకోని పక్షంలో వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని అదనపు కమీషనరుకు సూచించారు. ఈ ఓ.డబ్ల్యూ.ఎం.ఎస్. వ్యవస్థ ఏజన్సీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ ఆ సంస్థ ప్రతినిధిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రతీ వార్డులో పేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న పారిశుద్ధ్య కార్మికులు హాజరు విధానంకూడా సరిగా లేదని శానిటరీ ఇన్ స్పెక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సమీక్షా సమావేశంలో, అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు, ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రీ, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు వేణుగోపాల్, శ్యాంసన్ రాజు, ఎగ్జెక్యూటివ్ ఇంజినీర్లు, సహాయ వైద్యాధికారులు, ఏ.సి.పి. లు, శానిటరీ సూపెర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.