రేషన్ డీలర్లకు రెండు రోజుల్లో కమిషన్ చెల్లింపు..జెసి
Ens Balu
3
కలక్టరేట్
2020-09-02 20:51:38
శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్లకు రెండు రోజుల్లోగా చెల్లింపులు జరగాలని, లేనిచో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ సంబం ధిత అధికారులను హెచ్చరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత వారం రోజులుగా రేషన్ డీలర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో బుధవారం రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు, డీలర్లతో జె.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ డీలర్లకు సంబంధించిన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటిపై సానుకూలంగా స్పందించే అవకాశ ముందని తెలిపారు. అంతవరకు ప్రజలకు ఇబ్బందిలేకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందన్నారు. ప్రజలకు బియ్యం, పప్పు వంటి నిత్యావసర సరుకులను సకాలంలో పంపిణీచేయాలని ఆయన సూచించారు. తమకు చెల్లించాల్సిన కమీషన్ డబ్బులు సకాలంలో చెల్లిస్తే సమస్యలు ఉండబోవని డీలర్లు జె.సికి వివరించడంతో రెండు రోజుల్లోగా కమీషన్ చెల్లించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కమీషన్ చెల్లింపులు జరగని డీలర్లు ఎవరైనా ఉంటే వారి వివరాలను తమ దృష్టికి తీసుకురావాలని, చెల్లింపులు చేయని ఏ.ఎస్.ఓ ( సహాయ పౌర సరఫరాల అధికారి )లను ఇంటికి పంపిస్తామన్నారు.. ప్రతీ జిల్లాలో ఏ.ఎస్.ఓలు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కాని ఈ జిల్లాలో అది కనబడటం లేదని ఏ.ఎస్.ఓలపై జె.సి మండిపడ్డారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ.కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 విడతలు రేషన్ పంపిణీ జరగగా, జిల్లాలో 9 విడతల రేషన్ మాత్రమే పంపిణీ జరిగిందన్నారు. జిల్లాలో పిడిఎస్ 5 విడతల కమీషన్ కు గాను 3 విడతల కమీషన్ల క్రింద 3 కోట్ల 58 లక్షలు మంజూరుచేయడం జరిగిందన్నారు. మిగిలిన వారి నుండి పూర్తిస్థాయిలో వివరాలు లేనందున చెల్లింపులు జరగలేదని చెప్పారు. జిల్లాలో 2015 రేషన్ షాపులకు గాను 829 రేషన్ షాపుల డీలర్లకు కమీషన్ బకాయిలు చెల్లించామని, మరో 262 డీలర్లకు పాన్ కార్డులు లేని కారణంగా జమకాలేదని, పాన్ నెంబర్ ఇచ్చిన తక్షణమే వారికి చెల్లింపులు చేస్తామని జె.సికి తెలిపారు. అలాగే 462 మంది డీలర్లు నామినీస్ కేటగిరీ అప్షన్ ఇచ్చారని వారికి కూడా చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకో బోతున్నట్లు చెప్పారు. మిగిలిన 462 మంది వివరాలు పూర్తిగా అందజేయని కారణంగా జమచేయలేదని వాటి వివరాలు అందిన వెంటనే జమచేస్తామని జె.సికి వివరించారు.
జిల్లాలోని రేషన్ డీలర్లందరికీ రెండు రోజుల్లోగా పూర్తి చెల్లింపులు జరగాలని, ఇందుకు అవసరమైన సిబ్బందిని ఏర్పాటుచేసుకొని వివరాలు లేనివారి నుండి వివరాలు సేకరించి చెల్లింపులు చేయాలని జె.సి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరుకు సూచించారు. బకాయిలు చెల్లింపుల్లో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత తమపై ఉందని జె.సి స్పష్టం చేసారు. అలాగే డివిజన్ల వారీగా బృందాలను ఏర్పాటుచేసి రేషన్ డీలర్ల సమస్యలను ఎప్పటికపుడు తెలుసుకొని తమకు నివేదిక అందించాలని, సాంకేతిక పరమైన అంశాలు, ఇతర సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ( ఇన్ ఛార్జ్ ) శేష శైలజ, శ్రీకాకుళం, పాలకొండ సహాయ పౌర సరఫరాల అధికారులు అడపా ఉదయ్ భాస్కర్, సన్నాయి పంతులు, రేషన్ డీలర్ల మండల అధ్యక్షులు బొడ్డేపల్లి రవికుమార్, పి.వి.రమేష్, చిట్టి రామారావు, ఈశ్వరరావు, శిమ్మనాయుడు, అప్పారావు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.