సర్వేయర్లకు మూడంచెల అధునాతన శిక్షణ..
Ens Balu
4
Srikakulam
2020-09-03 14:02:24
రాష్ట్రంలో భూముల పున:సర్వే నిర్వహిస్తున్నట్లు సర్వే శాఖ సంయుక్త సంచాలకులు, రాష్ట్ర సర్వే శిక్షణా అకాడమి వైస్ ప్రిన్సిపాల్, వక్ఫ్ శాఖ కమీషనర్ సి.హెచ్. వి.ఎస్.ఎన్.కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలో సర్వే శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి భూముల పున:సర్వే చేడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇది ఒక బృహత్తర కార్యక్రమమన్న ఆయన వ్యక్తిగత కమతాల వారీగా సర్వే జరుగుతుందని ఆయన చెప్పారు. 3 దశలలో సర్వే జరుగుతుందని అందుకు తగిన విధంగా సర్వేయర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం - కంటిన్యుయస్ ఆపరేటింగ్ రిఫరింగ్ స్టేషన్ (సి.ఓ.ఆర్.ఎస్) నెట్ వర్కుతో పున:సర్వే కార్యక్రమం జరుగుతుందన చెప్పారు. ఈ విధానంలో హై ఎక్యూరసి, పారదర్శకత ఉంటుందని , రెవిన్యూ శాఖ సమన్వయంతో సర్వే చేపడుతున్నామని తెలిపారు. సర్వే చేయడానికి సర్వేయర్లకు ఆటో కాడ్, జిపిఎస్ తదితర ఆధునిక వ్యవస్ధలలో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 9,424 మంది సర్వేయర్లు పనిచేస్తున్నారని అందులో 7 వేల మందికి శిక్షణ పూర్తి అయిందన్నారు. ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమం సంబంధిత జిల్లా సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన చెప్పారు. పున:సర్వే పక్కాగా ఎటువంటి లోపాలు లేకుండా నాణ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మంచి ప్రామాణికమైన శిక్షణను అందిస్తున్నామని కుమార్ చెప్పారు. ఇప్పటికే సంబంధిత సర్వే పరికరాలు, శిక్షణా మాడ్యూల్స్ సరఫరా చేసామని ఆయన అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో ఏపి సర్వే ట్రైనింగు అకాడమి సహాయ సంచాలకులు టి.త్రివిక్రమ రావు, శ్రీకాకుళం జిల్లా సహాయ సంచాలకులు కె.ప్రభాకర్ పాల్గొన్నారు.