లక్షణం ఉంటే అది ఖచ్చితంగా కరోనానే...కలెక్టర్
Ens Balu
5
Srikakulam
2020-09-04 13:26:15
కరోనా లక్షణాలు ఉన్నప్పటికి కరోనా అవునా ? కాదా ? అనే ఆలోచన వద్దని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రజలను కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే చికిత్సకు రావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా శుక్ర వారం ప్రజలను ఉద్దేశించి ఒక సందేశాన్ని విడుదల చేస్తూ జిల్లా కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని సదుపా యాలు కల్పించామని అన్నారు. ప్రస్తుతం అత్యంత కీలక సమయంలో ఉన్నామని, రానున్న నెలన్నర రోజులు జిల్లాకు మరింత కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో రోజుకు 8 వందల నుండి వెయ్యి కేసులు వరకు నమోదు అవుతున్నాయని ఆయన చెప్పారు. ప్రజలందరూ పూర్తిగా అప్రమత్తంగా ఉండి వైరస్ నివారణకు సహకరించాలని కోరారు. శ్రీకాకుళం పట్టణంలో రోజుకు కనీసం రెండు వందల కేసులు నమోదు అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఇతర పట్టణాల్లో కూడా పరీక్షలు అధికంగా చేయుటకు నిర్ణయించామని చెప్పారు. జ్వరం, ఆయాసం వంటి ప్రాథమిక లక్షణాలు ఉన్న వాళ్ళు కరోనా కాదు అనే ధీమాతో ఉంటున్నారని, పరిస్ధితులను వాలంటీరుకు వివరింగా తెలియజేసి సరైన చికిత్సను సరైన సమయంలో పొందాలని ఆయన కోరారు. 94 శాతం కంటే తక్కువ ఆక్సిజన్, ఆయాసం, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం ఉన్న వారు చికిత్స పొందుటకు ఆలస్యం చేయరాదని ఆయన సూచించారు. సకాలంలో ఆస్పత్రిలో చేరడం వలన ఖచ్చితంగా ప్రాణాలు కాపాడగలమని వైద్యులు తెలియజేస్తున్నారని కలెక్టర్ వివరించారు. చిన్న పాటి లక్షణాలు ఉన్న వారికి చికిత్సను అందించుటకు కోవిడ్ కేర్ కేంద్రాల్లో 5 వేల పడకలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కోవిడ్ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నామని, నిపుణులైన వైద్యులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మంచి మందులతోపాటు ప్లాస్మా థెరాఫీని కూడా అందిస్తున్నామని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో 73 మందికి ప్లాస్మా థెరాఫీ అందించామని, వాళ్ళందరి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన చెప్పారు. జిల్లాలో కరోనా వ్యాప్తి నిరోధానికి మొదటి నుండి అనేక చర్యలు చేపట్టిన సంగతి ఆయన గుర్తు చేశారు. కంటైన్మెంటు జోన్లను పక్కాగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో 66 కంటైన్మెంటు జోన్లు ఉన్నాయని ఆయన తెలియజేస్తూ కంటైన్మెంటు జోన్లలో మొబైల్ వ్యాన్ల ద్వారా నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు చెప్పారు. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షలు నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఇంటివద్దకే పరిమితం కావాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు. ఇంట్లో ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ వారికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించాలని, వారితో మాట్లాడినప్పుడు మాస్కు విధిగా ఉపయోగించాలని సూచించారు. పెద్దలు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని ఆయన అన్నారు. ప్రజల జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్వచ్చంద సంస్ధల సహకారంతో ఉచితంగా ఫేస్ షీల్డులు పంపిణీ చేయుటకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఫేష్ షీల్డు ఉపయోగించడం వలన 80 శాతం వరకు కరోనా వైరస్ వ్యాప్తి నుండి సురక్షితంగా ఉండవచ్చని సర్వేలు సూచిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ చెప్పారు. వ్యాపార సంస్థల నిర్వాహకులు, ఆటో రిక్షావారు కరోనా వైరస్ కు హై రిస్కు కలిగి ఉంటారని అన్నారు. తమ వద్దకు వచ్చే కస్టమర్లు విధిగా మాస్కు ధరించేటట్లు చూడాలని ఆయన సూచించారు. జిల్లా లో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరుతూ కరోనా వైరస్ నిర్మూలనకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.