విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు నియోజవర్గాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్దుల సంక్షేమశాఖ అధికారులు, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో తన ఛాంబర్‌లో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జె.వెంకటరావు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, వారు అందించే కృత్రిమ అవయవాల తయారీ, పంపిణీ గురించి వివరించారు. కృత్రిమ కాళ్లు, చేతులు, కాలిపర్లను అందించడం జరుగుతోందని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులు, మరియు వయోవృద్దుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు నీలకంఠ ప్రధానో మాట్లాడుతూ, ప్రమాదవశాత్తూ కాళ్లు, చేతులు పూర్తిగా తొలగించిన వారికి, ఒక కాలు లేదా చేయి తొలగించిన వారికి కృత్రిమ అవయవాలను అమర్చడం జరుగుతుందని చెప్పారు. పోలీయో సోకిన పిల్లలకు, వారి వయసును బట్టి కాలిపర్స్‌ను అందజేస్తామని తెలిపారు.
కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, కృత్రిమ అవయవాలను తయారు చేసి, ఉచితంగా అందజేస్తున్న స్వచ్ఛంద సంస్థలను అభినందించారు. త్వరలోనే శిబిరాలను ఏర్పాటు చేసి, కృత్రిమ అవయవాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఈ శిబిరాల్లో దివ్యాంగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. విభిన్న ప్రతిభావంతులు స్వయంఉపాధి పొందేందుకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నిత్యం ఎంతో డిమాండ్ ఉండే ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, సెల్‌ఫోన్ రిపేరింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.
కృత్రిమ అవయవాల పనితీరును, వాటిని ధరించే విధానాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ సమావేశంలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రం (ఏఎల్ఎంయు), గురుదేవ ఛారిటబుల్ ట్రస్టు, అసోసియేషన్ సాయి కొరియన్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.