రాష్ట్రం లో మహిళా సాధికారత సాధించేందుకు అమలు చేస్తున్న విధానాలను మహిళా లోకం అందిపుచ్చుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్-పర్సన్ వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు. విశాఖపట్నం రెండు రోజుల పర్యటనకు వచ్చిన ఆమె ఏ.యూ. ప్లాటినమ్ జూబ్లీ వసతి గృహంలో విలేకరులతో మాట్లాడారు. “ఆమె” అంటే అర్ధ భాగం, హక్కుల్లో కూడా సగభాగం అని గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డే నని తెలిపారు. మహిళల్లో చైతన్యం కలిగించి మహిళా సాధికారికతను సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల మహిళా ప్రముఖులతో సదస్సులు చర్చా గోష్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం లా కాలేజీ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఐఏఎస్, మహిళా అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, మహిళా ఎమ్మెల్యేలు, ఎం.పిలు, వివిధ రంగాల ప్రముఖులతో మహిళా సాధికారత పై చర్చా గోష్టి జరుగుతుందని పద్మ తెలిపారు. మహిళల రక్షణ కు ఒక పటిష్ట యంత్రాంగంను ఏర్పాటు చేసి మహిళల చేతుల్లో పెట్టారని అన్నరు."దిశ" యాప్, పోలీస్ స్టేషన్లు, గ్రామ సచివాలయ మహిళా పోలీసు, వాలంటీర్ల నెట్వర్క్ ను పటిష్టం చేయుటకు మహిళా కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 నెలల్లో దాదాపు రూ.లక్ష కోట్లను మహిళలకు వివిధ పధకాల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేసారని గుర్తు చేశారు. బాలికల నుండి వృద్దురాలి వరకు స్వీయ రక్షణ, సాధికారత పొందుటకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని తెలిపారు. మహిళలకు అన్నిట్లో సగభాగం హక్కుగా ఇస్తున్నామని సీఎం పేర్కొన్నారని మహిళా సాధికారతకు ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.
నామినేటెడ్ పదవుల్లో 50 శాతంతో పాటు రాజకీయ రంగం లో మహిళల భాగస్వామ్యం సగానికి పెంచుతున్నారని వెల్లడించారు-దురదృష్టవశాత్తు జరుగుతున్న కొన్ని అఘాయిత్య సంఘటనలను రాజకీయం చేయటం తగదని హితవు పలికారు. గతంలో ఒక ముఖ్యమంత్రి యాసిడ్ బాధితురాలు అనురాధ కు చికిత్స కు నష్ట పరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తే హై కోర్ట్, సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ గుర్తు చేశారు.అలాంటి వారు మహిళల కోసం అంటూ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వాసిరెడ్డి పద్మ తో మహిళా కమిషన్ మెంబెర్ జయలక్ష్మి, డైరక్టర్ సూయజ్, ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.