విశాఖ జిల్లా జి.మాడుగుల–రావికమతం మండలాల సరిహద్దులో ఉన్న నేరేడుబంద గ్రామస్తులను ఆధార్ కార్డులను ఇప్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పాడేరు ఐటీడీఏ పిఓ ను ఆదేశించారు. నేరేడుబంద గ్రామంలో పాతికలోపు కుటుంబాలు ఉండగా మారుమూలన ఉండే ఈ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కాకపోవడం, ఆ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, వారు ఆస్పత్రిలో కాకుండా ఇంటి వద్దనే జన్మించడం, ఆరోగ్య సిబ్బంది రికార్డుల్లో కూడా వీరి గురించి నమోదు కాకపోవడంతో వీరికి బర్త్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడంతో ఆ గ్రామానికి చెందిన వారికి ఆధార్ కార్డులు జారీ చేయడ మారిన విషయం విదితమే. గడుతూరు పంచాయతీ కేంద్రానికి, రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కేంద్రానికి వెళ్లి జనన ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే నేరేడుబంద గ్రామం తమ జాబితాలో లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారని, తల్లిదండ్రులకు కూడా ఆధార్ కార్డులు లేని కారణంగా విద్యతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నామని వారు ఆవేదన చెందుతున్న విషయం ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దృష్టికి రావడంతో ఈ విషయంగా స్పందించారు.ఈ నేపథ్యంలో సోమవారం పాడేరు ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలక్రిష్ణతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఆధార్ తో లంకె ఉండటంతో ఆధార్ లేని కారణంగా నేరేడుబంద గ్రామానికి ఏ పథకం కూడా వర్తించని పరిస్థితి ఏర్పడటం, ఆ గ్రామంలో ఉన్న 18 మంది పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కావడాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. పాతిక కుటుంబాలు ఉన్న గిరిజన గ్రామం ఏ పంచాయితీ పరిధిలోనూ గుర్తించకపోవడం సబబు కాదన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ గ్రామం ఏ మండలం పరిధిలోకి వస్తుందనే విషయాన్ని నిర్ధారించడంతో పాటుగా ఆ గ్రామస్తులకు, అక్కడున్న పిల్లలకు తక్షణమే ఆధార్ కార్డులు ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంగా రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, నేరేడుబంద గ్రామంలో ఉన్న వారికి ప్రభుత్వ పథకాలలో లబ్దిదారులుగా చేర్చాలని పుష్ప శ్రీవాణి ఆదేశించారు.