స్పందన అర్జీలపై తక్షణమే స్పందించండి..


Ens Balu
9
Visakhapatnam
2021-08-23 13:46:48

విశాఖ జిల్లాలో వివిధ కార్యాలయాలలో పెండింగులో ఉన్న గ్రీవెన్స్ పిటిషన్లను  వెంటనే పరిష్కరించి నివేదికలను పంపాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులను ఆదేశించారు. సోమవారం  ఉదయం కలెక్టరు  ‘స్పందన’ లో వచ్చిన పిటిషన్లు,  పెండెన్సీ పై  అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  వివిధ శాఖల  జిల్లా అధికారులు, శుక్రవారం  నాడు వారి శాఖలో  పెండింగులో ఉన్న పిటిషన్ల ను  పరిశీలించి వాటిని పరిష్కరించి   నివేదికలను  పంపాలన్నారు. ఎస్.ఎల్.ఎ పరిధి దాటి పెండింగులో ఉండటంపై, సంబందిత శాఖల అధికారులతో  సమీక్షిస్తూ, దానికి  కారణాలు ఏమిటని ప్రశ్నించారు. వెంటనే వాటని పరిష్కరించాలన్నారు.  ఇతర శాఖల  ఫిటిషన్లు వస్తే  వెంటనే  డి.ఐ.ఓ కు  తెలియజేసి, వాటిని పంపివేయాలన్నారు.  గ్రామ, వార్డు సచివాలయాలలో  వివిధ శాఖలకు  సిబ్బంది  ఉన్నారని,  అక్కడి సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు  తీసుకోవాలన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలక్టరు ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు. వాటిని పరిశిలించి సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు.  వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. 
సోమవారం నాడు "స్పందన" లో   214  పిటిషన్లు అందాయి. వివిధ మండలాలలో అధికారులు, సిబ్బంది ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమానికి  ఉదయం గం.9-30 కల్లా హాజరు కావాలని  ఆదేశించారు.  వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మండల  కార్యాలయంలో , స్పందన కార్యక్రమానికి  పలువురు హాజరు  కాక పోవడం పై  కలెక్టర్  ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలలో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తే జిల్లా వరకు రారన్నారు.  రెవెన్యూ డివిజనల్ అధికారులు, , డి.ఎల్.డి.ఓ.లు , తాహసీల్దారులు,  ఎం.పి.డి.ఓ. లు, ఈ విషయం పై శ్రద్ద వహించాలన్నారు.  ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్లు, ఎం.వేణుగోపాలరెడ్డి, పి.అరుణ్ బాబు, ఎ.సి.పి.  శిరీష,  రెవెన్యూ డివిజనల్ అధికారి పెంచల కిషోర్, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.