నాడు నేడు నిర్మాణాలు వేగం పెంచాలి..


Ens Balu
2
Visakhapatnam
2021-08-23 14:47:57

విశాఖ జిల్లాలో నాడు నేడు క్రింద నిర్మాణపు పనులను, నిర్వహణ పనులు సత్వరమే పూర్తి గావించాలని  జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం సాయంత్రం కలెక్టరు నాడు – నేడు క్రింద వై.ఎస్.ఆర్ అర్బన్ క్లినిక్ లు, వై.ఎస్.ఆర్. విలేజ్ క్లినిక్ లు, వైద్యకళాశాలలు, ఆసుపత్రులు మొదలగు వాటి  భవనాల మరమ్మత్తులు, నిర్మాణపు పనులు, నిర్వహణ  పనులపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  ఆయా పనులకు  సంబంధించిన వివరాలు,  సాధించవలసిన లక్ష్యాలు,  ఇప్పటి వరకు పూర్తయినవి,  పెండింగు పనులు,  తదితర వివరాలపై ఇంజనీరింగు మరియు ఎం.పి.డి.ఓ.లతో చర్చించారు. కొన్ని మండలాలలో  వెనుకబడి ఉండటము పై ఆగ్రహం వక్తం చేశారు.  నాడు–నేడు క్రింద పూర్తి చేసిన పాఠశాలలు  హెచ్.ఎంలకు, ఆసుపత్రులను వైద్యాధికారులకు అప్పగించాలన్నారు..  9 పి.హెచ్.సి ల పనులను త్వరగా పూర్తి చేయాలని  ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.  జి.వి.ఎం.సి మరియు మునిసిపాలిటీలలోని  వై.ఎస్.ఆర్  అర్బన్ క్లినిక్ ల పనులను త్వరగా  పూర్తి చేయాలని సంబంధిత మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. 

వైద్య కళాశాలలకు సంబంధించిన పనులను మరియు కె.జి.హెచ్, విమ్స్ లకు సంబంధించిన పనులను త్వరగా చేపట్టి పూర్తి గావించాలని  ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఎ.పి.ఎస్.ఎం.ఐ.డి.సి ను ఆదేశించారు. పాడేరు వైద్య కళాశాల పనులు పురోగతి లో ఉన్నాయని, కె.జి.హెచ్, విమ్స్ లో  ఆయా విబాగాలను మార్చిన తదుపరి పనులు చేపట్టడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు తెలిపారు. గ్రామ సచివాలయ భవనాల నిర్మాణపు పనులను త్వరగా పూర్తి గావించి ఫొటోలను  అప్ లోడ్ చేయాలన్నారు.  ఎం.పి.డి.వో. లు సచివాలయ భవనాల పనులను పర్యవేక్షించాలని, పి.ఆర్ ఇంజనీర్లు కూడా బాధ్యత వహించి త్వరగా పూర్తి చేయాలన్నారు. అదే విధంగా డిజిటల్ లైబ్రరీలు, బి.ఎం .సి.సి లు, అంగన్ వాడీ భవనాలు నిర్మాణపు పనులను కలెక్టర్ సమీక్షించారు. పాఠశాలలో కోవిడ్ ప్రోటో కాల్ పాటించాలని పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా కనిపిస్తే  సి.హెచ్.సి లేదా పి.హెచ్ సి లకు పంపి పరీక్షలు చేయించి చికిత్స అందించాలన్నారు.   తరువాత ఉపాధి హామీ పనులను సమీక్షించారు. ఈ సమావేశంలో  జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, పంచాయితీ రాజ్ ఎస్.ఈ. సుధాకర్ రెడ్డి, డ్వామా పి.డి. సందీప్ పాల్గొన్నారు.  వీడియో కాన్పరెన్స్ ద్వారా  జి.వి.ఎం .సి కమిషనర్  జి.సృజన, ఎం.పి. డి. ఓ .లు, మున్సిపల్ కమిషనర్లు సమావేశంలో పాల్గొన్నారు.