మహిళా శిశు ఆరోగ్యానికి దోహదం పడాలి..


Ens Balu
4
Srikakulam
2021-08-24 14:22:24

మహిళా, శిశు ఆరోగ్యానికి అంగన్వాడీ కేంద్రాలు దోహదం చేయాలని జిల్లా కలెక్టరు శ్రీకేష్ లాఠకర్ స్పష్టం చేశారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళ వారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం మంచి పౌష్ఠికాహారం అందిస్తుందని, దానిని సకాలంలో పంపిణీ చేసి ఆరోగ్య జిల్లాగా రూపొందించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో 1.90 లక్షల మంది తల్లులు, పిల్లలు ఈ పథకం క్రింద ప్రయోజనం పొందుతున్నారని ఆయన అన్నారు. వీరందరికీ సక్రమంగా పౌష్ఠికాహాం పంపిణీ చేయడం వలన చిన్నారులు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తారని కలెక్టరు పేర్కొన్నారు. తల్లులు, పిల్లలపై దృష్టి సారించాలని, ఎక్కడా నిర్లక్ష్యం వద్దని సూచించారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై  నిర్లక్ష్యం వహించామంటే అంతకంటే ఘోరం ఉండదని, వారిని మోసం చేసినట్లు  గుర్తించాలని ఆయన అన్నారు. అక్రమాలు, నిర్లక్ష్యంపై ఆరోపణలు అందితే కటిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తల్లీబిడ్డల మరణాల రేటు తగ్గడంలో ఐ.సి.డి.ఎస్ కీలక పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఆహార పదార్థాల పంపిణీలో ఎక్కడా అక్రమాలు జరగరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ స్పష్టం చేశారు. వీరఘట్టంలో జరిగిన సంఘటన వలన ఐ.సి.డి.ఎస్ పై చర్యలు మొట్ట మొదటిగా  తీసుకున్నామని ఆయన చెప్పారు. సరుకుల రవాణాలో జాప్యం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయని, వాటిని నివారించాలని ఆయన ఆదేశించారు. చిన్నారుల పెరుగుదల పర్యవేక్షణ (గ్రోత్ మానిటరింగ్) చేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్ర స్థాయి తనిఖీలు పెంచాలని, అంగన్వాడీ కేంద్రాలను ఎక్కువగా సందర్శించాలని ఆయన చెప్పారు. పాతపట్నం, మెలీయాపుట్టి, సీతంపేట ప్రాంతంలో మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 

వీరఘట్టం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన తెలిపారు. రేషన్ పంపిణీ సమయంలో మహిళా పోలీసు సేవలు వినియోగించు కోవాలని ఆయన చెప్పారు. గర్భిణీ లకు కరోనా వాక్సినేషన్ తక్కువగా ఉందని, వాక్సినేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గర్భిణీలకు వాక్సినేషన్ తక్కువగా ఉందని ఆయన అన్నారు. అవగాహన కలిగించడం ద్వారా ఎక్కువ మందికి పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు త్వరగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి. జయ దేవి మాట్లాడుతూ జిల్లాలో 18 ప్రాజెక్టులు, 4192 అంగన్వాడి కేంద్రాలు అందులో 3403 ప్రధాన కేంద్రాలు ఉన్నాయన్నారు. పౌష్ఠిాహారం అందిస్తున్నామని,వై.యస్.ఆర్ సంపూర్ణ పోషణ క్రింద ఇంటికి ఆహార సామగ్రి పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోగా అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు అందాలని, అయితే వివిధ కారణాల వలన కొద్ది రోజులు జాప్యం జరుగుతోందని ఆమె వివరించారు. పాలు పరిమాణం తక్కువగా వస్తుందని ఆమె చెప్పారు. సీతంపేట ప్రాంతంలో ఇంటెర్నెట్ సౌకర్యం పూర్తి స్థాయిలో లేదని, ఆఫ్ లైన్ లో అనుమతించాలని ప్రతిపాదనలు సమర్పించామని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా కె.శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ ఎస్ఇ జి.బ్రహ్మయ్య, ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.