ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్..
Ens Balu
3
Vizianagaram
2021-08-25 13:17:21
విజయనగరంజిల్లాలో పర్యాటకులను ఆకర్షించేందుకు ఆలయాలను కలుపుతూ, టూరిజం సర్క్యూట్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఆదేశించారు. జిల్లాలోని టెంపుల్ టూరిజంను అభివృద్ది చేసేందుకు కలెక్టర్ చర్యలు ప్రారంభించారు. దీనిలో భాగంగా దేవాదాయ, పర్యాటక శాఖాధికారులతో తన ఛాంబర్ లో బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం, రాజమన్నార్ రాజగోపాలస్వామి ఆలయం, రామనారాయణం, విజయనగరం కోట, మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాల, గురజాడ అప్పారావు స్మారక గృహం, బౌద్ద ఆరామం గురుభక్తుల కొండ, రామతీర్ధం, కుమిలి దేవాలయాల సముదాయం తదితర ప్రాంతాలను కలుపుతూ పర్యాటకంగా ఒక ప్యాకేజ్‌ను రూపొందించాలని సూచించారు. విశాఖపట్నం నుంచి టూరిజం బస్సులో పర్యాటకులను తీసుకువచ్చి, ఈ ప్రదేశాలను చూపించాలని చెప్పారు. దీనికోసం వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేసి, అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. పర్యాటక పరంగా అభివృద్ది చేసేందుకు జిల్లాలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, తరువాత దశలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ ఇవి పుష్పవర్థన్, జిల్లా పర్యాటక శాఖాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, మాన్సాస్ ఇఓ వెంకటేశ్వర్రావు, పైడితల్లి అమ్మవారి దేవస్థానం సహాయ కమిషనర్ కిషోర్, బొబ్బిలి ఇఓ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.