యోగాతో ఊపిరితిత్తులు రక్షించుకోవచ్చు..కమిషనర్
Ens Balu
2
Tirupati
2020-09-06 10:49:37
ప్రతి నిత్యం యోగా చేయడం వలన మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ, జిల్లా యోగా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో నగరప్రజలతో పాటు కమిషనర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా, మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. యోగ వలన కలిగే ప్రయోజనాలను నగరప్రజలకు కూడా తెలియజేసి, వారు ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు పార్కులో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ యోగా నేర్చుకుని మీ ఇంటిలోనే రోజు గంటపాటు యోగా చేసుకోవచ్చునన్నారు. దైనందిన జీవితంలో యోగా ను ఒక అలవాటుగా మార్చుకోవడం వలన మనం అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవచ్చునన్నారు. మనలో చాలా మంది ఉద్యోగ రీత్యా ఎనిమిది తొమ్మిది గంటల పాటు కూర్చుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. అటువంటి సమయంలో మనము ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వయసు పెరిగే కొద్దీ మనం ఒక చోట కొంతసేపు నిలకడగా కూర్చోలేని పరిస్థితి వస్తుందని, యోగా వలన ఈ సమస్యను అధిగమించ వచ్చునన్నారు. కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ యోగాలో చేసే ప్రాణాయామం, కాపాలభాతి వంటి కొన్ని ఆసనాలు చేయడం వలన ఊపిరితిత్తుల పై చేడు ప్రభావం పడకుండా మనల్ని కాపాడుతాయన్నారు. నేను కూడా నేల రోజులుగా ప్రతి రోజు యోగా చేస్తున్నానని, నా శరీరం ఎంతో రిలాక్స్ ఉంటోందన్నారు. యోగా పై చాలా మందికి అవగాహన లేదని వారందరికి అవగాహన కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. నగరప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆంఫీ థియేటర్ నందు మనిషికి మనిషికి ఎనిమిది అడుగుల భౌతికదూరం పాటించినా సుమారు 150 మంది యోగా శిక్షణ పొందేందుకు వీలుంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా యోగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మెడ, నడుము ఆసనాలు, ప్రాణాయామం, బ్రీతింగ్, హాండ్ స్ట్రిచింగ్, చక్రాసన, పాద హస్తాసన, అర్ధ కటి చక్రాసన, తాడాసన, వజ్రాసన, సమవృతి కాపాలభాతి, బసరిక, నాడీశుద్ది వంటి ఆసనాలు చేయించారు. ఈ యోగ తరగతుల్లో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. చంద్రశేఖర్, నగరప్రజలు పాల్గొన్నారు.