జిల్లాలో తాత్కాలికంగా పునరుద్దరణ..
Ens Balu
5
Vizianagaram
2021-08-25 15:52:11
విజయనగరం జిల్లాలో పార్వతీపురం-శ్రీకాకుళం ప్రధాన రహదారిపై తోటపల్లి కుడికాల్వపై కల్వర్టుకు పెద్ద గుంతలు ఏర్పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి ఆదేశాల మేరకు జలవనరుల శాఖ అధికారులు బుధవారం యుద్దప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టి సాయంత్రానికి తాత్కాలికంగా పునరుద్దరించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ రోడ్డుపై ఉల్లిభద్ర కల్వర్టుకు పెద్ద గుంతలు ఏర్పడటంతో ట్రాఫిక్ నిలిచిపోయినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చిన వెంటనే ఆ రోడ్డును తక్షణం పునరుద్దరించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో రంగంలోకి దిగిన తోటపల్లి ప్రాజెక్టు అధికారులు ఆర్ అండ్ బి అధికారులతో సమన్వయం చేసుకొని జెసిబి తదితర యంత్రాలను వినియోగించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను తాత్కాలికంగా పూడ్చి రాకపోకలకు వీలుగా ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేశారు. సాయంత్రం కల్లా ఈ మార్గంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిచేసి రాకపోకలను పునరుద్దరించడం జరిగిందని తోటపల్లి ఎస్.ఇ. సుగుణాకర్ రావు తెలిపారు.