అవ్వా మీకు పథకాలు అందుతున్నాయా..


Ens Balu
3
Kakinada
2021-08-27 13:23:02

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు, ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తెలిపారు.శుక్రవారం కాకినాడ 41వ డివిజన్ మల్లయ్య అగ్రహారం కృష్ణుడి గుడి వద్ద జేసీ లక్ష్మీశ.. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ/వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల ఆఖరు శుక్రవారం, శనివారాలలో "సిటిజన్ ఔట్రీచ్" కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నగరంలో గల ప్రతి వార్డు సచివాలయ పరిధిలోగల ప్రతి ఇంటిని సంబంధిత సచివాలయ కార్యదర్శి, వాలంటీర్లు సందర్శించి, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరు, ప్రభుత్వం అందించే వివిధ సేవలుపై  ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీరుతో పాటు ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం ద్వారా సచివాలయ సిబ్బంది, వాలంటీర్ ఒక గ్రూపుగా ఏర్పడి సచివాలయం, వాలంటీర్ల పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అందిస్తున్న సేవల వివరాలు తెలియపరచడం  జరుగుతుందన్నారు. అదేవిధంగా ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవడంతో సంక్షేమ పథకాలు అమలులో ఎదురవుతున్న అవరోధాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని స్థానిక సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ప్రతి గడప వద్దకు వెళ్లి విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ లక్ష్మీశ తెలిపారు.  కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సిటిజన్ ఔట్రీచ్  కార్యక్రమాన్ని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత జేసీ, కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ 2021-22 , వార్డు సచివాలయ సిబ్బంది వివరాలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేసి, గృహాల వద్దకు వెళ్లి ప్రజలతో ప్రభుత్వం అందిస్తున్న సేవల వివరాలను ఈ సందర్భంగా తెలియజేసి, వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.   ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చోడిపల్లి వెంకట సత్య ప్రసాద్, అదనపు కమిషనర్ సీహెచ్ నాగ నరసింహారావు, ట్రైనీ కలెక్టర్ గీతాంజలి శర్మ, కార్పొరేటర్లు గోడి సత్యవతి, జేడీ పవన్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఇతర నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.