తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని విభాగాలకు చెందిన సమస్త సమాచారాన్ని అవగాహన చేసుకోవాలని జెఈవో సదా భార్గవి సూచించారు. క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి సంస్థ ప్రతిష్టను పెంచేలా కృషి చేయాలన్నారు. కొత్తగా నియమితులైన ఏఈవోలకు వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. సూపరింటెండెంట్లుగా పని చేస్తూ ఏఈవోలుగా పదోన్నతి పొందిన 11 మందికి శుక్రవారం సాయంత్రం నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్బంగా పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో జెఈవో వారితో సమావేశమయ్యారు. జెఈవో మాట్లాడుతూ, విధి నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి, అప్పగించిన పనులు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. ఉద్యోగులు సమయానికి కార్యాలయాలకు వచ్చేలా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రతి రోజు సంప్రదాయ దుస్తులు ధరించి కార్యాలయాలకు రావాలన్నారు. ముఖ్యమైన ఫైళ్ళు కంప్యూటర్‌తో పాటు రిజిస్టర్ రూపంలో కూడా భద్ర పరుచుకోవాలని అన్నారు. ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల మొత్తాలను రిటైర్‌మెంట్ రోజే చెక్కు ద్వారా అందించే ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగి రిటైర్డ్ కావడానికి ఆరు నెలల ముందు నుంచే ఏఈవోలు ఈ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పారు. కారుణ్య నియమకాల విషయంలో శ్రద్ధ తీసుకుని మరణించిన ఉద్యోగి కుటుంబీకుల నుంచి 11 రోజుల్లోపు దరఖాస్తు స్వీకరించి 30 రోజుల్లోపు ఉద్యోగం వచ్చేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో గోవిందరాజన్, ప్రజా సంబంధాల అధికారి డా.టి.రవి పాల్గొన్నారు.