విజయనగరం జిల్లాలో నిర్మాణంలో వున్న వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్‌లు, అర్బన్ క్లినిక్ ల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేసి అందజేయాల్సి వుంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థ ఎం.డి. డి.మురళీధర్ రెడ్డి చెప్పారు. ఈ క్లినిక్‌లలో పనిచేసేందుకు సిబ్బంది నియామక ప్రక్రియను ఇప్పటికే కుటుంబ సంక్షేమ కమిషనర్ ప్రారంభించారని, డిసెంబరు నాటికి ఈ సిబ్బంది అంతా ఆయా ఆసుపత్రుల్లో చేరతారని, అప్పటికల్లా ఈ భవనాలు పూర్తిచేయాల్సి వుంటుందన్నారు. ఈ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు గ్రామాల్లోనే వైద్య సౌకర్యాలు ఏర్పడతాయని, గ్రామంలోని క్లినిక్‌లో ఏవిధమైన వైద్య సదుపాయాలు అందుబాటులో వున్నాయో అవగాహన కల్పిస్తే వారు వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమకు సమీపంలోని వై.ఎస్.ఆర్.క్లినిక్‌లలో సదుపాయాలను వినియోగించుకుంటారని చెప్పారు. జిల్లా పర్యటనకోసం శుక్రవారం నగరానికి వచ్చిన ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. మేనేజింగ్ డైరక్టర్ మురళీధర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఆసుపత్రుల నిర్మాణం పనులు, ఆసుపత్రుల్లో నాడు - నేడు, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన వైద్య పరికరాలు, ఆక్సిజన్ ప్లాంట్‌ల నిర్వహణకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య మౌళిక సదుపాయాల సంస్థ ఇంజనీర్లతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వై.ఎస్.ఆర్.క్లినిక్‌ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా భవనాలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అప్పగించాలని ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి., రోడ్లు భవనాలు, ప్రజారోగ్య ఇంజనీరింగ్, పి.ఆర్.ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీర్లను ఆదేశించారు. ఆసుపత్రి భవనాల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటికి అవసరమైన చిన్నచిన్న పనులను స్థానిక సంస్థల నిధుల నుంచే చేపట్టాలని స్పష్టంచేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పి.హెచ్.సి.లు, వై.ఎస్.ఆర్.హెల్త్ క్లినిక్‌లకు సంస్థ సూచించిన రంగులనే వేయాలని, ఎక్కడా మార్పులు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. ఆయా భవనాలు చూడగానే ఆసుపత్రులనే అంశాన్ని ప్రజలు గుర్తించే విధంగా రంగులు వేయాలన్నారు. నాడు - నేడులో ఆధునీకరిస్తున్న అన్ని ఆసుపత్రుల వద్ద గతంలో ఆ భవనాలు ఎలా వుండేవి, ఇప్పుడెలా వున్నాయనే ఫోటోలతో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణంకోసం నేషనల్ హెల్త్ మిషన్ నుంచి నిధులు ఇస్తామని పేర్కొన్నారు.
కోవిడ్ సందర్భంగా జిల్లాలోని సి.హెచ్.సి.లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ల నిర్వహణను ఆయా ఆసుపత్రుల అభివృద్ధి నిధుల నుంచే చేపట్టాల్సి వుంటుందన్నారు. 30 పడకల కంటే అధికంగా బెడ్లు వున్న పి.హెచ్.సి.లు, సిహెచ్‌సిలకు తమ సంస్థ ద్వారా డీజిల్ జనరేటర్ సెట్లు, విద్యుత్ సరఫరా నియంత్రణకు ట్రాన్స్ ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నందున విద్యుత్ సరఫరా కారణంగా ప్రమాదాలు జరగకుండా పాత విద్యుత్ సరఫరా లైన్లను మార్పు చేయాలని ఎం.డి. సూచించారు. ఆయా ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏజెన్సీల ద్వారా ఏర్పాటయ్యాక అవి పనిచేస్తున్నట్టు సంబంధిత ఆసుపత్రుల సూపరింటెండెంట్ లేదా మెడికల్ ఆఫీసర్ లు సర్టిఫికెట్ ఇవ్వాల్సి వుంటుందన్నారు.
జిల్లాలో ఆసుపత్రుల్లో నాడు - నేడు కింద ఆసుపత్రుల ఆధునీకరణ పనులు, కొత్త ఆసుపత్రి భవనాల నిర్మాణంపై ఆ సంస్థ కార్యనిర్వాహక ఇంజనీర్ సత్యప్రభాకర్ ఎం.డి.కి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో 9 ఆసుపత్రుల్లో 81 ఐ.సి.యు., 338 నాన్ ఐ.సి.యు. పడకలకు రూ.3.18 కోట్లతో ఆక్సిజన్ పైప్‌లైన్ ల ఏర్పాటుకు ప్రతిపాదించామని, వీటిలో ఇప్పటివరకు 51 ఐ.సి.యు, 213 నాన్ ఐ.సి.యు. పడకలకు కలసి మొత్తం 264 పడకలకు ఆక్సిజన్ సరఫరా ఏర్పాటు చేశామన్నారు. 9 పనుల్లో 7 పనులు జరుగుతున్నాయని, మరో రెండు పనులు ప్రారంభం కావలసి వుందని చెప్పారు. మూడు ఆసుపత్రుల్లో పి.ఎస్.ఏ. ప్లాంట్‌లు, ఒక చోట ఆర్.టి.పి.సి.ఆర్. ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కమ్యూనిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో నబార్డు నిధులతో 8 పనులు రూ.58.10 కోట్ల ఒప్పంద విలువతో నబార్డు నిధులతో చేపట్టామని, ఈ పనులన్నీ కొనసాగుతున్నట్టు వివరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు సంబంధించి నిర్మాణ ప్రాంతంలో ప్రస్తుతం ముళ్ల కంపలు తొలగించే పనులు జరుగుతున్నట్టు పేర్కొన్నారు. పి.హెచ్.సి.ల అప్ గ్రెడేషన్ కింద 68 పనులను రూ.48.24 కోట్లతో చేపట్టామని వివరించారు. కొత్తగా మరో 12 పి.హెచ్.సిల పనులు రూ.2.17 కోట్లతో చేపట్టామన్నారు. ఆసుపత్రుల్లో మరమ్మత్తులకు సంబంధించి 56 పనులను రూ.26.48 కోట్లతో చేపట్టామన్నారు.
అంతకుముందు ఎం.డి. మురళీధర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని గాజులరేగ వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ ప్రాంతాన్ని జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ తో కలసి పరిశీలించారు. ఏ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి. అధికారులు ఎస్.ఇ. శివకుమార్, ఇ.ఇ. సత్యప్రభాకర్ తదితరులు నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. కలెక్టరేట్ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామరాజు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి, రోడ్లు, భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ, ప్రజారోగ్య ఇంజనీరింగ్ ఎస్.ఇ. శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఇ.ఇ. ఎం.ఇ.ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.