విజయనగరం జిల్లాలోని 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కోవిడ్ టీకా వేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం మెగా డ్రైవ్ నిర్వహించటం ద్వారా పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు లక్ష మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం జేసీ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యాధికారులతో సమావేశం జరిగింది. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాలని, ఇదొక్కటే మహమ్మారిని ఎదుర్కొనేందుకు మంచి మార్గమని ఈ సందర్భంగా జేసీ పేర్కొన్నారు. మెగా డ్రైవ్‌లో అనుసరించాల్సిన విధానాలపై, పద్ధతులపై వైద్యాధికారులకు మార్గనిర్దేశం చేశారు. పలు సూచనలు జారీ చేశారు. పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించటం ద్వారా అత్యధిక మందికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. ప్రతి సచివాలయంలో, ఆరోగ్య కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి కోవిడ్ టీకా వేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించి మెగా డ్రైవ్‌ను విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీన కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నామని, దీనికి వైద్యాధికారులు, సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని జేసీ సూచించారు. ఈ సమావేశంలో డీఐవో డా. గోపాల కృష్ణ, పలువురు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.