సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ నేరుగా వార్డులోని ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో సంభాషించి వారి బాగోగులను, ప్రభుత్వ పథకాల సమాచారం వారికి అందుతున్నదీ లేనిదీ, ఆయా పథకాల ప్రయోజనాలు వారికి అందుతోందీ లేనిదీ తెలుసుకునేందుకు వేసిన ప్రశ్నలివి. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్న తీరు, వలంటీర్ల ద్వారా ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల సమాచారం ఏవిధంగా అందుతున్నదీ పరిశీలించి, వారిలో ఆయా పథకాలపై ఏమేరకు అవగాహన ఉన్నదీ తెలుసుకునేందుకు, ప్రభుత్వ పథకాలపై అన్ని కుటుంబాల్లో అవగాహన కల్పించి అర్హులంతా ఆయా పథకాలు పొందేందుకు తోడ్పాటు అందించే కార్యక్రమమే సిటిజెన్స్ ఔట్ రీచ్. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం ద్వారా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు బృందాలుగా ఏర్పడి ఆయా సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి, ప్రతి కుటుంబాన్నీ కలసి వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, అర్హులైన వారు ఎవరైనా ఆయా పథకాలు పొందలేకపోతే వారితో దరఖాస్తు చేయించడం, ప్రభుత్వ పథకాలు ఆయా కుటుంబాలకు ఏ మేరకు అందాయో తెలుసుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి శుక్రవారం నగరంలోని 14వ వార్డు పరిధిలోని కొత్తపేట కుమ్మరివీధి, 5వ వార్డు పరిధిలోని బాబామెట్ట ప్రాంతాల్లో మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మతో కలసి పర్యటించారు. ఆయా వార్డుల్లోని పలు ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వ పథకాలు ఏవిధంగా అందుతున్నదీ, వారికి ప్రభుత్వ పథకాలపై ఏ మేరకు అవగాహన ఉన్నదీ తెలుసుకున్నారు. వార్డు వలంటీర్లు ఆయా ఇళ్లను తరచుగా సందర్శించి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల సమాచారాన్ని తెలియజేస్తున్నదీ లేనిదీ ఆరా తీశారు. ఆయా కుటుంబాలకు చెందిన వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. కొత్తపేట కుమ్మరివీధికి చెందిన వృద్దుడు సూర సన్యాసిరావు ఇంటికి వెళ్లి ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్న కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, ఆయనకు ప్రతినెలా ఫించను వస్తున్నదీ లేనిదీ అడిగారు. ప్రతినెలా రూ.2250 ఫించను మొత్తం అందుతోందని ఆయన చెప్పారు. తనకు కొంత పొలం వుందని, అందుకు రైతుభరోసా సహాయం కూడా అందుతోందని వివరించారు. తాను తన కుటుంబ సభ్యులూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్టు కలెక్టర్‌కు తెలిపారు.
అనంతరం అదే వార్డులోని నంద రమాదేవి ఇంటికి వెళ్లిన కలెక్టర్ వారి కుటుంబం గురించి ఆరా తీశారు. తమ పిల్లలకు అమ్మ ఒడి కింద సహాయం అందిందని, తన భర్త టైలర్ కావడంతో ప్రభుత్వం నుంచి రూ.10 వేలు సహాయం అందిందని, తమకు పేదలందరికీ ఇళ్లు పథకంలో కొండకరకాంలో ఇళ్లు కూడా మంజూరయ్యిందని రమాదేవి కలెక్టర్‌కు వివరించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించినదీ లేనిదీ కలెక్టర్ అడిగారు. ఇళ్ల నిర్మాణం త్వరగా ప్రారంభించాలని, ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ చెప్పారు. 5వ వార్డు బాబామెట్ట ప్రాంతంలోనూ కలెక్టర్ పర్యటించారు. ఆ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తున్న పలువురు వ్యక్తులతో మాట్లాడి వారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. ఒక డోస్ వేయించుకున్న తర్వాత వ్యాధికి గురి కావడంతో రెండో డోసు వేయించుకోలేదని ఒక వ్యక్తి తెలిపారు. ఏంటిబాడీస్ వున్నందున కొద్దిరోజుల తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటామని చెప్పారు. ఇదే కాలనీలో రిటైర్డ్ రెవిన్యూ అధికారి చంద్రుడు ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలోని హేమలత అనే మహిళతో మాట్లాడారు. వలంటీర్ తమ ఇంటికి తరచూ వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలపై సమాచారం ఇస్తారని హేమలత వివరించారు. తమ కుటుంబంలోని వారంతా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగర పరిధిలో శతశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని కమిషనర్ వర్మను ఆదేశించారు. నగరంలో ఎంతమంది వ్యాక్సిన్ వేయించుకున్నారు, మరెందరికి వ్యాక్సిన్ వేయాల్సి వుందనే సమాచారం తనకు అందజేసి వారికి వ్యాక్సిన్ ఏవిధంగా వేయనున్నదీ ప్రణాళిక తనకు వివరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సిటిజెన్స్ అవుట్ రీచ్ కార్యక్రమం అన్ని గ్రామాలు, పట్టణాల్లో జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లు బృందాలుగా ఇళ్లను సందర్శించి ఆయా కుటుంబాలను కలుస్తున్నారని, వారికి ప్రభుత్వ పథకాలను వివరించడంతోపాటు వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వార్డు కార్పొరేటర్ ఎస్.వి.వి.రాజేశ్వరరావు, నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.