శ్రీకాకుళం జిల్లాలో ఆస్పత్రులలో జరుగుతున్న నాడు నేడు పనులు సకాలంలో పూర్తిచే యాలని రాష్ట్ర ఆసుపత్రుల మౌళిక వసతుల కల్పన సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కె.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నాడు నేడు పనులపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో జరుగుతున్న నాడు నేడు పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన 2022 జనవరి నాటికిపనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. ఇప్పటికే 70 శాతానికి పైగా పనులు పూర్తిచేసుకున్న ఆసుపత్రిల్లో మిగిలిన పనులను త్వరిగతిన పూర్తిచేయాలని అన్నారు. పూర్తయిన ఆసుపత్రులకు తగిన రంగులు, మౌళిక వసతులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా ఆసుపత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల మేరకు తీర్చిదిద్దాలని కోరారు. నిధుల కొరతతో పనులు అసంపూర్తిగా వదలివేయ రాదని చేసిన ప్రతి పనికి కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించడం జరుగుతుందని అన్నారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు ఫోటోలు తీసి తమకు పంపాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు రానున్న నవంబర్ నాటికి పూర్తికావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇదే స్ఫూర్తితో మిగిలిన చోట్ల పనులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.ఆసుపత్రుల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక , ఐరన్ కొరత లేకుండా చూసుకోవాలని తెలిపారు. పూర్తయిన ఆసుపత్రుల వద్ద ఖర్చు చేసిన నిధుల వివరాలతో పాటు ఆసుపత్రిలో లభించే సదుపాయాల బోర్డులను ఏర్పాటుచేయాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు తగిన విధంగా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
కొన్ని ఆసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నప్పటికి కనెక్షన్లు ఇవ్వలేదని, కనెక్షన్లతో పాటు ఒకసారి పరీక్షించి సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే వర్కింగ్ ఇన్ గుడ్ కండిషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలకు ఎటువంటి కొరత లేకుండా చూడాలని, జిల్లా కలెక్టర్ కోరిన వాటిని తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చిన్న చిన్న పనులు చేసుకునేందుకు హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్స్ లేదా ఆరోగ్యశ్రీ నిధులను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన కేంద్రంలో డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటుకు స్థలం కోరారని వాటిని మంజూరుచేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కార్పొరేట్ సామాజిక భాద్యత (సీ.ఎస్.ఆర్) క్రింద జిల్లాలో పనులు బాగానే జరుగుతున్నాయని, ఇది అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించి పనులను సకాలంలో పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బగాది జగన్నాధరావు, రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణవేణి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు, ఆర్ అండ్ బి పర్యవేక్షక ఇంజినీర్ కాంతిమతి, ప్రజారోగ్య కార్యనిర్వాహక ఇంజినీర్ కె.సుగుణాకరరావు, ఇతర జిల్లా అధికారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.