తపాలా పథకాలను వినియోగించుకోవాలి..


Ens Balu
2
Srikakulam
2021-08-27 14:24:25

శ్రీకాకుళం తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను ప్రజలందరూ సద్విని యోగం చేసుకోవాలని తపాలా శాఖ పర్యవేక్షకులు అద్దేపల్లి కాంతారావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఛాంబరులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఐపిపిబి ( ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ) ద్వారా తపాలా శాఖ ఖాతాదారులు  ఏ బ్యాంకు ఖాతాలోని నగదునైనా తమ ఇంటివద్దనే సంబంధిత పోస్ట్ మేన్ ద్వారా నగదు పొందేలా సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. అలాగే పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్లను ప్రతీ ఏడాది ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని, వారి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లను కూడా ఇంటివద్దనే పొందేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తపాలా శాఖ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు ఏడాదికి కేవలం రూ.12/-లు చెల్లించి పి.ఎం.ఎస్.బి.వై (ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన) ద్వారా రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని, ఏడాదికి రూ.330/-లు చెల్లించి రూ.2 లక్షల వరకు బీమా సౌకర్యాన్ని కూడా పొందవచ్చన్నారు. సుకన్య సమృద్ధి ఖాతా ద్వారా 10ఏళ్ల లోపు ఆడపిల్లలకు అత్యధిక వడ్డీని (7.6 శాతం) చెల్లించడం జరుగుతుందన్నారు. గ్రామీణ తపాలా జీవిత బీమా ద్వారా 19 సం.ల నుండి 45 సం.ల వయస్సు గల గ్రామీణ ప్రజలు  బీమా చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు సరైన అవగాహన లేక తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవడం లేదని, ఇప్పటికైనా వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.