రహదారులే అభివృద్దికి కీలకమని, విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. రోడ్లను నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ది వేగవంతమవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం క్రింద చేపట్టనున్న గ్రామీణ రహదారుల నిర్మాణంపై, పంచాయితీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు అవగాహనా సదస్సు కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. స్వాతంత్య్రం సిద్దించి 75 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో, దేశంలో నిర్వహిస్తున్న అజాదీ కా అమ్రిట్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ సెమినార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెమినార్‌ను ప్రారంభించిన ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు పిఎంజిఎస్ వై పథకం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు దశలుగా చేపట్టిన పిఎంజిఎస్‌వై పథకం క్రింద వేసిన సుమారు 865 కిలోమీటర్ల రోడ్ల ద్వారా, మారుమాల ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం మూడో దశ పనులు ప్రారంభం కానున్నాయని, దీనికోసమే ఈ సెమినార్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. కనీసం వంద మంది నివాసం ఉంటున్న గిరిశిఖర గ్రామాలకు కూడా రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేయాలని ఎంపి కోరారు.
సెమినార్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, పంచాయితీరాజ్ ఎస్ఇ పి.విజయ్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవిఎన్ వెంకటరావు, పిఏ టు ఎస్ఇ చీకటి దివాకర్, పలువురు డిఇఇలు, ఎఇఇలు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఉత్తమ ఇంజనీర్లకు ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేశారు.