తిరుమలలో ఆగస్టు 30న గోకులాష్టమి..
Ens Balu
3
Tirumala
2021-08-28 10:30:16
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని సాక్షాత్తు ద్వాపరయుగపురుషుడైన శ్రీకృష్ణునిగా స్మరించుకుని ఆగస్టు 30వ తేదీన శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. శ్రీవారి ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గోకులాష్టమి ఆస్థానం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదనలు సమర్పిస్తారు. శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తికి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ద్వాదశారాధనం చేపడతారు. అదేవిధంగా ఆగస్టు 31న తిరుమలలో ఉట్లోత్సవాన్ని పురస్కరించకుని సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆలయంలోని రంగనాయకుల మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. కాగా, ప్రతి ఏడాది తిరుమలలో ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు, శ్రీకృష్ణస్వామివారు తిరుచ్చిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ హారతులు స్వీకరిస్తారు. యువకులు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉట్లోత్సవంలో పాల్గొంటారు. కానీ కోవిడ్ - 19 నిబంధనల మేరకు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాలను శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది ఏకాంతంగా టీటీడీ నిర్వహించనుంది.ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 31న శ్రీవారి ఆలయంలో నిర్వహించే వర్చువల్ సేవలైన ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.